కొత్త పన్నుతో రూ.8,552 కోట్ల నష్టం! | Sakshi
Sakshi News home page

కొత్త పన్నుతో రూ.8,552 కోట్ల నష్టం!

Published Thu, May 7 2015 2:23 AM

finance ministers meeting on GST tax in tiruvanantapuram today

- జీఎస్‌టీ పన్నుతో రాష్ట్ర ఆదాయానికి భారీగానే చిల్లు
- నేడు తిరువనంతపురంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ

హైదరాబాద్:
కేంద్రం తీసుకువచ్చిన వస్తువులు.. సేవల పన్ను (జీఎస్‌టీ)తో తెలంగాణకు ఏటా రూ.7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. ఇప్పటివరకు ప్రతిపాదనల్లో ఉన్న ఈ పన్నుకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. దీంతో జీఎస్‌టీ పన్నుల ప్రభావమెలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. వరి, పొగాకు ఉత్పత్తులు, పెట్రోలు, ఎక్సైజ్ ఉత్పత్తులను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్‌టీ పాత బకాయిలు చెల్లించటంతో పాటు తాము సూచించినవాటిని మినహాయిస్తే.. జీఎస్‌టీని స్వాగతిస్తామని ఇప్పటికే ప్రకటించింది.

గత నెలలో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక  మంత్రుల ఎంపవర్డ్ కమిటీ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగా, జీఎస్‌టీపై చర్చిం చేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఎంపవర్డ్ కమిటీ గురువారం కేరళలోని తిరువనంతపురంలో మరోమారు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరవనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం జీఎస్‌టీతో ప్రస్తుతం రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో తగ్గిపోతోంది. వరి, ఆహార ఉత్పత్తులపై వచ్చే సెస్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు రూ.700 కోట్లు వసూలవుతోంది.

దీంతో పాటు పొగాకు, పొగాకు అనుబంధ ఉత్పత్తులపై అత్యధికంగా 20 శాతం పన్ను అమల్లో ఉంది. దీన్ని జీఎస్‌టీలో కలపటంతో ఏటా దాదాపు రూ.500 కోట్లు ఆదాయం వస్తుంది. ఇప్పుడు అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. క్రమంగా కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్‌టీ) ఎత్తివేత కారణంగా ఏటా పన్నుల ద్వారా రూ.4,840 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణ ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2013-14 వార్షిక ఆదాయం లెక్కల ఆధారంగా ఈ అంచనా వేసింది. వ్యాట్‌ను సైతం జీఎస్‌టీలో విలీనం చేయటంతో మరో రూ.2,113 కోట్లకు పైగా నష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషించాయి. లగ్జరీ పన్ను, ఎంట్రీ టాక్స్‌లను సైతం జీఎస్‌టీలో కలిపితే తెలంగాణకు మరో రూ.399 కోట్లు నష్టం వాటిల్లుతుంది.

ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.8,552 కోట్ల రెవెన్యూను కోల్పోయే ప్రమాదముంది. అంత మేరకు రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిహారంగా నిధులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఎస్‌టీ బిల్లుకు సంబంధించి చేయాల్సిన సవరణలను సూచించింది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడటం ఖాయమని.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఎంత పరిహారం చెల్లిస్తుంది.. ఏయే ఉత్పత్తులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు లభిస్తుంది.. అనేది వేచి చూడాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement