
ప్రభుత్వ కొత్త రేట్లపై చర్చ
ఆర్థిక మంత్రి సీతారామన్ సైతం హాజరు
న్యూఢిల్లీ: జీఎస్‌టీలో శ్లాబుల తగ్గింపుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం 20న చర్చించనుంది. ఈ బృందంలో భాగం కాకపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సమావేశానికి హాజరు కానుండడం గమనార్హం. 5 శాతం, 18 శాతం శ్లాబులతో కూడిన కొత్త నమూనాను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే మంత్రుల బృందం ముందుంచింది. పొగాకు తదితర కొన్నింటిపై 40 శాతం పన్ను ప్రతిపాదించింది.
దీనిపై ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో జీఎస్‌టీ మంత్రుల బృందం (జీవోఎం) చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘జీవోఎంలో కేంద్రం భాగం కానప్పటికీ.. ఆర్థిక మంత్రి పాల్గొనడం, ప్రసంగించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఉద్దేశ్యాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. విహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరుగురు సభ్యుల జీవోఎంకు కనీ్వనర్‌గా వ్యవహరిస్తున్నారు.కొత్త రేట్లను దిపావళికి ముందే అమల్లోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది.
జీఎస్‌టీ రేట్లలో మార్పుతో ఆదాయం తగ్గుతుందన్న ఆందోళనలను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. ఆదాయంలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సమాన వాటా ఉంటుందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేశాయి. కొత్త ప్రతిపాదనలతో నిరీ్ణత కాలంలో వినియోగం పెరిగి, అధిక ఆదాయానికి దారితీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక ప్రతిపాదిత రెండంచెల పన్ను శ్లాబులతో కూడిన కొత్త జీఎస్‌టీ విధానంలో మెజారిటీ ఆదాయం 18 శాతం నుంచే ఉంటుందని తెలిపాయి. ప్రస్తుతం బంగారంపై 3శాతం, ఇతర వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. ఆహార వస్తువులు కొన్నింటిని పన్ను నుంచి మినహాయించగా, కొన్ని 5 శాతం రేటు పరిధిలో ఉన్నాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ (హానికారక)పై 40 శాతం రేటు అమలవుతోంది.