
జీఎస్‌టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి సీతారామన్ స్పందన
న్యూఢిల్లీ: జీఎస్‌టీ ఇటీవలి సంస్కరణలతో వినియోగం పుంజుకుని, మెరుగైన ఆదాయానికి బాటలు వేస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. తద్వారా జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణతో ఏర్పడే రూ.48,000 ఆదాయ లోటు భర్తీ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధికి బలాన్నిస్తుందన్నారు.
మొదటి త్రైమాసికంలో (జూన్ క్వార్టర్) బలమైన వృద్ధి రేటు నమోదు కావడం, చరిత్రాత్మక జీఎస్‌టీ సంస్కరణలతో.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.3–6.8 శాతం అంచనాలను అధిగమిస్తామని ప్రకటించారు.జీఎస్‌టీలో 12%, 28% జీఎస్‌టీ శ్లాబులను ఎత్తివేస్తూ.. అందులోని మెజారిటీ ఉత్పత్తులను 5, 18 శాతం శ్లాబుల్లోకి మార్చుతూ గత వారం జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించడం తెలిసిందే.
దీన్ని ప్రజా సంస్కరణగా మంత్రి సీతారామన్ అభివరి్ణంచారు. దీనివల్ల ప్రతి కుటుంబానికీ ప్రయోజనం దక్కుతుందన్నారు. రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ కావడాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే కార్ల తయారీదారులు, బీమా కంపెనీలు, పాదరక్షల వంటి కొన్ని పరిశ్రమలు రేట్ల తగ్గింపును ప్రకటించడాన్ని గుర్తు చేశారు.
‘రూపాయి’ని గమనిస్తున్నాం..
కరెన్సీ మారకం విలువలను ప్రభుత్వం గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘డాలర్‌తో రూపాయి ఎక్కువ విలువను కోల్పోయింది. ఇతర కరెన్సీలతో కాదు’ అని స్పష్టం చేశారు. భారత్‌పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధించడం, భారత క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో డాలర్‌తో రూపాయి విలువ 88.38 కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే.
ప్రధాని చొరవ.. ఆర్థిక మంత్రి కసరత్తు
‘ఒక్కసారి జీఎస్‌టీ సంగతి చూడండి’ ప్రధాని మోదీ చేసిన సూచన ఆధారంగానే ఈ భారీ కసరత్తుకు పూనుకున్నట్టు మంత్రి సీతారామన్ స్వయంగా వెల్లడించారు. ‘‘గత జీఎస్‌టీ కౌన్సిల్ భేటీకి ముందు (2024 డిసెంబర్‌లో) ప్రధాని నాకు కాల్ చేశారు. ‘ఒకసారి జీఎస్‌టీ విధానంపై దృష్టి పెట్టండి. రేట్ల పరంగా ఎందుకంత అయోమయం? వ్యాపారాలకు సులభతరంగా మార్చండి’ అని చెప్పారు.
ఆ తర్వాత బడ్జెట్(2025–26)లో ఆదాయపన్ను ఉపశమన చర్యలపై చర్చల సమయంలోనూ.. ‘జీఎస్‌టీపై మీరు పనిచేస్తున్నారు కదా?’ అంటూ ప్రధాని మళ్లీ గుర్తు చేశారు. జీఎస్ టీ అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు ముగిసిన నేపథ్యంలో సమగ్ర సమీక్ష అవసరమని భావించాం. వ్యా పారులు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల కోణం నుంచి చూశాం’’ అని మంత్రి సీతారామన్ చెప్పారు.