
ప్రతి కుటుంబానికి ప్రయోజనం
ఎకానమీ వృద్ధికి ఊతం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) సంస్కరణలతో వినియోగానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విస్తృత స్థాయిలో వివిధ ఉత్పత్తుల రేట్లను క్రమబద్ధీకరించడం వల్ల ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. మొత్తం మీద ప్రజలకు గణనీయంగా మేలు చేకూర్చే కీలక సంస్కరణగా జీఎస్‌టీ సవరణలను ఆమె ఓ ఇంటర్వ్యూలో అభివరి్ణంచారు.
ధరల తగ్గుదల ప్రయోజనాలు ప్రజలకు బదిలీ అయ్యేలా తానే వ్యక్తిగతంగా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. పరిశ్రమ ఇప్పటికే రేట్ల తగ్గింపు విషయంలో సానుకూలంగా స్పందించిందన్నారు. పలు కార్ల సంస్థలు మొదలుకుని ప్రభుత్వ రంగ బీమా సంస్థలు, పాదరక్షలు, దుస్తుల బ్రాండ్లు గణనీయంగా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయని వివరించారు.
కొత్త జీఎస్‌టీ రేట్లు అమల్లోకి వచ్చే నాటికి మిగతావి కూడా రేట్లను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘మొత్తం 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే సంస్కరణ ఇది. అత్యంత పేదలకు కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
గతంలో నాలుగు శ్లాబులుగా (5%, 12%, 18%, 28%) ఉన్న జీఎస్‌టీ రేట్లను రెండు శ్లాబులుగా (5%, 18%) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవి సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో సబ్బుల నుంచి కార్లు, షాంపూలు, ట్రాక్టర్లు, ఏసీల వరకు 400 పైగా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను ఉండదు. విలాస వస్తువులతో పాటు కొన్ని ఉత్పత్తులకు 40 శాతం శ్లాబ్ ఉంటుంది.
సామాన్యులపై ఫోకస్ ..
ఒక దేశం, ఒకే పన్ను నినాదంతో 2017లో జీఎస్‌టీ ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా చేపట్టిన సవరణలు, అతి పెద్ద సంస్కరణలని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానంగా సామాన్య ప్రజానీకం ప్రయోజనాలపై దృష్టి పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులపై ప్రతి పన్నును లోతుగా సమీక్షించామని, చాలా మటుకు ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి వివరించారు.
బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపులపరంగా ఇచి్చన వెసులుబాటుతో ప్రజల చేతిలో మరింత డబ్బు మిగలనుండగా, తాజా జీఎస్‌టీ సంస్కరణల వల్ల ఉత్పత్తుల ధరలు తగ్గి వినియోగానికి ఊతం లభిస్తుందన్నారు. దీనితో కుటుంబాల నెలవారీ రేషన్, మెడికల్ బిల్లులు మొదలైన వాటి భారం తగ్గుతుందని చెప్పారు. జీఎస్‌టీ రేట్ల కోత ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు పరిశ్రమ వర్గాలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోందని, దీనిపై సానుకూలత వ్యక్తమవుతోందని సీతారామన్ చెప్పారు.
వ్యాపారాల నిర్వహణ సులభతరం..
చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు కూడా జీఎస్‌టీ సంస్కరణలు తోడ్పడతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. నిబంధనల భారం సడలింపు, వేగవంతమైన రిఫండ్‌లు, సులభతరంగా రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలన్నీ సంస్కరణల ప్యాకేజీలో భాగమేనని చెప్పారు. కొత్త విధానంలో 90 శాతం వరకు రిఫండ్‌లు నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాసెస్ అవుతాయని, కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు రోజుల్లోనే పూర్తవుతుందని చెప్పారు. ఒకే తరహా ఉత్పత్తులను ఒకే శ్లాబ్ తేవడం వల్ల ఉత్పత్తుల వర్గీకరణపై నెలకొన్న గందరగోళం కూడా తొలగిపోతుందని మంత్రి చెప్పారు.
రాష్ట్రాలకు ధన్యవాదాలు..
జీఎస్‌టీ సంస్కరణలకు మద్దతునిచ్చిందుకు గాను రాష్ట్రాలకు సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపాదిత సవరణలు సామాన్యుడికి ప్రయోజనం చేకూర్చేవేనని అంతిమంగా రాష్ట్రాలు అభిప్రాయపడినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను లేఖలు రాసినట్లు చెప్పారు.
రాష్ట్రాలు ఎల్లప్పుడూ రేట్ల కోతకు సుముఖంగానే ఉంటాయని, కానీ దానివల్ల రాబడికి కోత పడటంపైనే వాటికి ఆందోళన ఉంటుందని మంత్రి వివరించారు. ‘అయితే, దీని వల్ల రాష్ట్రాలపైనే కాకుండా కేంద్రంపైనా ప్రభావం ఉంటుందని వారికి చెప్పాను. కాకపోతే రేట్లు తగ్గి, ప్రజలు మరింతగా కొనుగోళ్లు చేయడం వల్ల, ఆదాయ లోటు భర్తీ అవుతుందని వివరించాను. ఆ విధంగా ఏకాభిప్రాయం సాధించడం వీలైంది‘ అని ఆమె వివరించారు. జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాలు నిర్మాణాత్మకంగా పాలుపంచుకున్నాయని మంత్రి కితాబిచ్చారు. పన్ను సంస్కరణల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాయని పేర్కొన్నారు.