నీళ‍్ల కోసం కదంతొక్కిన కర్ణాటక రైతులు

farmers agitation in karnataka - Sakshi

ఉత్తర కర్ణాటకలో స్తంభించిన జనజీవనం

ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు

గోవా సీఎంతో పాటు ఇతర నేతల శవయాత్రలు

సాక్షి, బెంగళూరు: తమ ప్రాంతానికి రావాల్సిన నీటి కోసం ఉత్తర కర్ణాటక ప్రాంత రైతులు నిప్పులా రగిలిపోయారు. ఎన్నో ఏళ్లుగా వారిలో నిండిన ఆవేదన కట్టలు తెంచుకుంది. నిరసనల రూపంలో వారి ఆవేదన పెల్లుబికింది. మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలనే డిమాండ్‌తో రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉత్తర కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులకు అన్ని వర్గాల నుండి అపూర్వంగా మద్దతు లభించింది. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పాటు బస్‌ల టైర్‌లకు నిప్పుపెట్టారు.

ఉత్తర కర్ణాటక బంద్‌ నేపథ్యంలో బుధవారం ఉదయం నుండే హుబ్లీ-ధార్వాడతో పాటు గదగ్, బెళగావి, హావేరి, నరగుంద, నవలగుంద, బాగల్‌కోట, ఇళకళ్‌ తదితర ప్రాంతాలన్నింటిలో రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఉత్తర కర్ణాటక బంద్‌ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కళాశాలలు, పాఠశాలలకు మంగళవారం రోజునే సెలవు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలపడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

సినీరంగంతో పాటు ఆటోడ్రైవర్లు, వైద్యులు, లాయర్లు, ఇలా అన్ని వర్గాల వారు రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కర్ణాటకలో జనజీవనం పూర్తిగా స్థంబించింది. హుబ్లీ-ధార్వాడతో పాటు ఇతర ప్రాంతాలన్నింటిలో కేంద్రం, రాష్ట్రానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్‌.యడ్యూరప్ప, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌లకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. బంద్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర‍్యలు తీసుకున్నారు.

సీఐకు తృటిలో తప్పిన ప్రమాదం
హుబ్లీ-ధార్వాడ ప్రాంతాల్లోని వివిధ కూడళ్లలో నిరసనకారలు టైర్లకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలియజేశారు. నవలగుంద పట్టణంలో నిరసన కారులు టైర్లకు నిప్పు పెట్టే సందర్భంలో అడ్డుకోబోయిన సీఐ దివాకర్‌ ప్యాంట్‌కు నిప్పు అంటుకుంది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. తక్షణం పక్కనే ఉన్న సహచరులు మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఇక ఇదే సందర్భంలో పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక‍్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హుబ్లీలోని ఎంపీ ప్రహ్లాద్‌ జోషి కార్యాలయం పై నిరసన కారులు రాళ్లు రువ్వడంతో పాటు కార్యాలయాన్ని ముట్టడించారు. నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌లో నిరసనకారులు యడ్యూరప్ప ఫ్లెక్సీలను పట్టుకొని వాటిపై బురద జల్లుతూ తమ నిరసనను తెలియజేశారు. మరికొంత మంది నిరసనకారులు అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. 

నాయకులను వేలం వేసిన నిరసన కారులు..
ఇక హుబ్లీలో నిరసన కారులు వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. మహదాయి పోరాట సమితి సభ్యులతో పాటు డ్రైవర్ల సంఘం నేతృత్వంలో నాయకులను వేలం వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు యడ్యూరప్ప, సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ల చిత్ర పటాలను ఉంచిన నిరసనకారులు వీరిని వేలం వేశారు. ఇక మహదాయి విషయంలో మాట తప్పిన యడ్యూరప్పను ఉచితంగానే తీసుకోవచ్చని, ఆయనకు ఎలాంటి రేటు లేదంటూ నిరసనకారులు ప్రకటించారు. 

రక్తం చిందించైనా నీరు తెచ్చుకుంటాం..
తమ రక్తం చిందించైనా సరే మహదాయి నీటిని తెచ్చుకుంటామని నిరసనకారులు నినదించారు. బంద్‌లో భాగంగా కర్ణాటక రక్షణ వేదిక నేతృత్వంలో హుబ్లీ రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు తమ చేతులను బ్లేడ్‌లతో కోసుకున్నారు. రక్తం చిందినా సరే పోరాటం నుండి వెనక్కుతగ్గబోమంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్బంలో పోలీసులు, నిరసనకారలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బ్లేడ్‌లతో చేతులు కోసుకున్న కొంత మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో స్థానిక కిమ్స్‌ ఆస్పత్రిలో నిరసనకారులను చేర్పించారు.

మహదాయి నదీ జలాల వివాదం గురించి క్లుప్తంగా..
గోవ, మహారాష్ట్ర, కర్ణాటకకు తాగు, సాగునీటిని అందించే మహదాయి నదీ జలాల పంపకం విషయంలో కర్ణాటక, గోవ, మహరాష్ట్ర మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌.ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహదాయి ఉపనదులైన కళసా–బండూరు అనే రెండు ఉపనదులకు అడ్డంగా కాలువలను నిర్మించి 7.56 టీఎంసీల నీటిని మలప్రభకు మరలించాలనే విషయం తెరపైకి తీసుకువచ్చారు. దీని వల్ల బెళగావి, గదగ్, దార్వాడ తదితర జిల్లాల్లో తాగుసాగునీటి ఇబ్బందులు తప్పుతాయనేది ప్రభుత్వ ఆలోచనా. అయితే గోవా మాత్రం కర్ణాటక ప్రతిపాదనను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. మహదాయి నుంచి 7.56 టీఎంసీల నీటిని మరలించడం వల్ల స్థానికంగా పర్యావరణం దెబ్బతింటుందని వాదిస్తోంది. అంతేకాకుండా తమ రాష్ట్రం పర్యాటకం పై ఆధారపడి ఉందని నదీ జలాల మరలింపు దీని పై ప్రభావం చూపుతుందని చెబుతూ చాలా ఏళ్లుగా ఈ ప్రతిపాదనను అడ్డుకుంటోంది. ఈ విషయమై గత ఏడాది జులైలో మహదాయి నదీ జలాల ట్రిబ్యునల్‌లో కర్ణాటకకు వ్యతిరేకంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అప్పటి నుంచి  ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నిరసనలు మిన్నంటాయి. దాదాపు ఏడాదిన్నరగా అక్కడ ఏదో ఒక రూపంలో నిరంతరంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top