కలవరపెడుతున్న ఉపగ్రహాల విఫలం

Failure Of Satellites Disturbing The ISRO - Sakshi

సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపడుతున్న ప్రయోగాల్లో ఇటీవల రాకెట్లు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి ఉపగ్రహాలను నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశపెడుతున్నాయి. అయితే క్షక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు విఫలం కావడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. గతంలో రాకెట్‌లు విఫలమై ఉపగ్రహాలు సముద్రం పాలయ్యేవి. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ రాకెట్ల పరిజ్ఞానంలో కొంత సాంకేతిక పరిపక్వత చెందకపోవడంతో మిశ్రమ విజయాలను మాత్రమే సాధించగలిగారు. ఆ తరువాత పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల తయారీకి పూనుకుని చేసిన మొదటి ప్రయోగం పూర్తిగా విఫలమైంది.

ఆ తరువాత 40 రాకెట్లు విజయవంతంగా ప్రయోగించగా, రెండు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. ఇందులో పీఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్‌ పూర్తిగా విఫలం కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ39 రాకెట్‌ క్షక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలో విఫలమైంది. అలాగే జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2010లో రెండు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విఫలమయ్యాయి. 2006లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–02  ప్రయోగం కూడా విఫలమైంది. 2007లో జీఎస్‌ఎల్‌వీ ఎప్‌–04 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా ఇన్‌శాట్‌–4సీఆర్‌ ఉపగ్రహం సాంకేతికలోపంతో నిరుపయోగంగా మారింది.  గత నెల 29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 రాకెట్‌ జీశాట్‌–6ఏ ఉపగ్రహాన్ని నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలో దిగ్విజయంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహ విద్యుత్‌వ్యవస్థ పూర్తిగా విఫలమై సిగ్నల్స్‌ అందకుండా పోయి వృథాగా మారింది.

ముఖ్యంగా పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌ రాకెట్‌ ప్రయోగాల్లో నాలుగు రాకెట్లు సాంకేతికలోపంతో విఫలమవగా, మూడు ఉపగ్రహాలు సాంకేతిక లోపంతో నిరుపయోగంగా మారాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకింత కలవర పాటుకు గురై గురువారం నిర్వహించబోయే ప్రయోగానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కే శివన్‌కు మొదటి ప్రయోగం చేదు అనుభవాన్ని మిగిల్చింది. రెండో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top