
సునీల్ అరోరా
ఈవీఎంలపై ఎటువంటి అనుమానం అక్కర్లేదని, వాటి పనితీరును అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులతో పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు.
చంఢీగఢ్: ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)పై ఎటువంటి అనుమానం అక్కర్లేదని, వాటి పనితీరును అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులతో పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్‌ఈఆర్)నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ సమావేశంలో ‘ముందుకు సాగడానికి అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడారు. ఈవీఎం వ్యవస్థ పనితీరుపై అసలు సందేహ పడాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ సీఈసీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అరోరా ఈమేరకు వ్యాఖ్యానించారు.
‘ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందేమిటంటే ఏ యంత్రమైనా పాడవుతుంది. కానీ పాడవడానికి, సరిగా పనిచేయకపోవడానికి మధ్య తేడా ఉంది. మీరు ఒక కారు కొన్నారు అనుకోండి అది ఓ వారం లోపు పనిచేయకపోవచ్చు’అని ఉదహరించారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను విశ్వసనీయతతో, నిష్పాక్షికతతో, నైతికతతో నిర్వహించడానికి మాకు సాధ్యమైనంత వరకు పనిచేస్తామని వెల్లడించారు. పీజీఐఎమ్‌ఈఆర్ 2018లో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 2వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు. సమావేశంలో పీజీఐఎమ్‌ఈఆర్ డైరెక్టర్ జగత్ రామ్, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.