
హరియాణాలోని కర్నల్ పట్టణంలో గోధుమ గడ్డిని తగలబెడుతున్న దృశ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా చెత్త తగలబెట్టడాన్ని నిలిపివేయటం, ఇటుక బట్టీలు, పరిశ్రమల వద్ద వాయు కాలుష్య నిబంధనలను అమలు చేయడం, అత్యాధునిక యంత్రాల ద్వారా రోడ్లను శుభ్రం చేయటం వంటి చర్యలు తీసుకోనున్నారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించనున్నారు.
ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. విద్యుత్ సమస్య దృష్ట్యా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో మాత్రం నిషేధం లేదు. గాలి నాణ్యత ఇంకా దిగజారితే పార్కింగ్ ఫీజును 3–4 రెట్లు పెంచటం, బస్సులు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతారు. మరోవైపు.. పంజాబ్, హరియాణాల్లో రైతులు గోధుమ గడ్డిని తగులబెడుతున్న దృశ్యాలను నాసా శాటిలైట్ చిత్రీకరించింది. అక్టోబర్, నవంబర్‌లో పంజాబ్, హరియాణాల్లో గోధుమ గడ్డిని తగులబెట్టడంతో చెలరేగే పొగకు తోడు దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరిగింది.