కార్తీ ఇళ్లపై ఐటీ దాడులు

ED raids Karti Chidambaram's premises in Delhi, Chennai  - Sakshi

సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌–మాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు శనివారం ఉదయం మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి చెందిన 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఢిల్లీలోని చిదంబరం నివాసం, చెన్నైలోని కార్తీ నివాసం, కార్తీ చార్టెర్డ్‌ అకౌంటెంట్, అతని వ్యక్తిగత సహాయకుడి ఇళ్లు తదితర చోట్ల తనిఖీలు జరిగాయి. దక్షిణ ఢిల్లీ జోర్‌బాగ్‌లో ఉన్న తన నివాసంలోకి వచ్చిన ఈడీ అధికారులు కార్తీ ఇంట్లో సోదా చేయటానికి వచ్చినట్లు చిదంబర్‌ మీడియాతో చెప్పారు. అయితే, తన కుమారుడు కార్తీ చెన్నైలో ఉంటారని, ఇది తన నివాసమని వారికి తెలిపానన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈడీ ఈ సోదాలు చేపట్టిందన్నారు. 

ఈడీ దాడులను ‘నగుబాటు చర్యలు’గా ఆయన అభివర్ణించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడుల వ్యవహారం కేసులో కార్తీ పాత్రపైనా విచారిస్తున్నామని ఈడీ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌ ఒకటో తేదీన కూడా కార్తీతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీల అంశంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ప్రభుత్వం చిదంబరం, కార్తీ ఇళ్లపై ఈడీ దాడులు చేయించిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. 
 

Back to Top