స్మృతి ఇరానీ ఆరోపణలపై తేల్చేసిన ఈసీ

 EC Rejects Smriti Iranis Claims Of Booth Capturing In Amethi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అమేథిలో బూత్‌ ఆక్రమణలకు పాల్పడ్డారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలను యూపీ ఎన్నికల ప్రదానాధికారి తోసిపుచ్చారు. కాగా సోమవారం లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌ సందర్భంగా ఓ వృద్ధురాలు తాను బీజేపీకి ఓటు వేయాలని చెప్పినా బలవంతంగా ఆమెచే పోలింగ్‌ అధికారి కాంగ్రెస్‌ బటన్‌ను నొక్కించారని చెబుతున్న వీడియోను స్మృతి ఇరానీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించి రాహుల్‌పై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.

కాగా, బూత్‌ల ఆక్రమణలకు పాల్పడుతున్న రాహుల్‌ను శిక్షించాలా లేదా అనేది అమేథి ప్రజలు తేల్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. స్మృతి ఇరానీ ఆరోపణలపై ఈసీ అధికారులు, పరిశీలకులు సంబంధిత పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీయగా వీడియో క్లిప్‌లో పేర్కొన్న ఆరోపణలు కట్టుకథగా వెల్లడైంది. కేంద్ర మంత్రి ఆరోపణలపై తొలుత ప్రిసైడింగ్‌ అధికారిని పోలింగ్‌ విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టామని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. మరోవైపు అమేథిలో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. అమేథిలో స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో తలపడుతున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top