క్యూఆర్‌ సామ్‌ పరీక్ష విజయవంతం

DRDO Successfully Test Twin Quick Reaction Air Missiles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉగ్రవాద సంస్థల శిబిరాలపై దాడులు నిర్వహించిన కొన్ని గంటల్లోనే భారత రక్షణ దళాలు ఇంకో శుభవార్తను అందుకున్నాయి. ఆర్మీకి మరింత శక్తినిచ్చే క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ పరీక్షలు మంగళవారం విజయవంతంగా జరిగాయి. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, భారత్‌ డైనమిక్స్‌ లిమిట్‌డ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ దాడులు చేయగలగడం మాత్రమే కాకుండా.. రేడార్ల ద్వారా జామ్‌ చేసే ప్రయత్నాలను ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌ మెషర్ల ద్వారా తిప్పికొట్టగల శక్తి కూడా వీటికి ఉంది. ట్రక్కులో లేదా చిన్న గొట్టంలోంచి ప్రయోగించగల క్యూఆర్‌సామ్‌ 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

పాతబడిన కొన్ని క్షిపణి వ్యవస్థలకు బదులుగా క్యూఆర్‌సామ్‌లను సమకూర్చుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ 2007లో తొలిసారి టెండర్లు ఆహ్వానించింది. అయితే అప్పట్లో పెద్ద స్పందన లేకపోయింది. ఈ మధ్యలో వీటి తయారీకి డీఆర్‌డీవో సిద్ధమైంది. దీనికోసం 2014లో రూ.476.43 కోట్ల నిధులు కేటాయించారు. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి క్యూఆర్‌సామ్‌లను కొనుగోలు చేయాలనుకున్న రక్షణ శాఖ 2017లో తన ఆలోచనలను విరమించుకుని డీఆర్‌డీవో సిద్ధం చేసినవాటికి పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా అదే ఏడాది జూన్, జూలైల్లో ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ క్షిపణులను రెండుసార్లు విజయవంతంగా పరీక్షించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌)ల శాస్త్రవేత్తలు ఇందులో కీలకపాత్ర పోషించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top