
మెగా టీంకు డీఎంకే కసరత్తు
తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాదం మోపకుండా అడ్డుకునేందుకు డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటుకాబోతోంది.
తమిళనాడులో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాదం మోపకుండా అడ్డుకునేందుకు డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటుకాబోతోంది. ఇందుకు తగ్గట్టుగా డీఎంకేతో దోస్తీకి ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలు కసరత్తు మొదలుపెట్టాయి. గత కొన్నేళ్లుగా డీఎంకేకి వామపక్షాలు దూరంగా ఉంటూ వస్తున్నాయి. డీఎంకే చీఫ్ కరుణానిధికి నమ్మిన బంటుగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ సైతం 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం హ్యాండిచ్చారు.
మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, డీఎండికేలు కూటమిగా ఏర్పడి డీఎంకే ఓటమిలో కీలకపాత్ర పోషిం చాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై బీజేపీ పెత్తనం రోజురోజుకూ పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రం లో క్రియాశీలపాత్ర పోషించేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తుండటంతో ఆ పార్టీని అడ్డుకునేందుకు డీఎంకే సిద్ధం అవుతోంది. డీఎంకే నిర్వహించే ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ, వీసీకేలు పాల్గొనేందుకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.