ఎమ్మెల్యేల జీతాలు 400% పెంపు! | delhi mla's salaries hiked by 400 percent | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల జీతాలు 400% పెంపు!

Dec 4 2015 8:14 AM | Updated on Apr 4 2018 7:42 PM

ఎమ్మెల్యేల జీతాలు 400% పెంపు! - Sakshi

ఎమ్మెల్యేల జీతాలు 400% పెంపు!

ఢిల్లీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తమ జీతాలను నాలుగు రెట్లు పెంచేసుకున్నారు. ప్రస్తుతం వాళ్లకు నెలజీతం రూ. 88వేల వంతున ఉండగా, దాన్ని రూ. 2.35 లక్షలు చేయాలంటూ ఓ స్వతంత్ర కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ యథాతథంగా ఆమోదించింది.

ఢిల్లీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తమ జీతాలను నాలుగు రెట్లు పెంచేసుకున్నారు. ప్రస్తుతం వాళ్లకు నెలజీతం రూ. 88వేల వంతున ఉండగా, దాన్ని రూ. 2.35 లక్షలు చేయాలంటూ ఓ స్వతంత్ర కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ యథాతథంగా ఆమోదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గురువారం నాడే ఈ బిల్లును ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదించేశారు. జీతాలు పెంచుకోడానికి ఇది సరైన సమయం కాదని బీజేపీ సభ్యులు వాదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో, తాము ఈ బిల్లు మీద ఓటింగుకు దూరంగా ఉంటున్నట్లు విపక్ష నేత విజేందర్ గుప్తా చెప్పారు.

లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ పెంపును సూచించింది. ప్రస్తుతం తమకొస్తున్న జీతాలతో నెల గడవడం కూడా కష్టంగానే ఉంటోందని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో ఆగస్టు 21న ఈ కమిటీని నియమించారు. అయితే ప్రభుత్వం తీవ్రంగా నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని ఓపక్క చెబుతూ మరోవైపు ఇలా గంపగుత్తగా జీతాలు పెంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ అలవెన్సు కింద నెలకు రూ. 70 వేలు, కార్యాలయాలను తీర్చిదిద్దుకోడానికి వన్ టైం అలవెన్సుగా లక్ష రూపాయలు, కంప్యూటర్ల కొనుగోలుకు లక్ష, ఆఫీసు అవసరాలకు మరో రూ. 60వేలు ఇచ్చారు. ఏడాదికి ప్రయాణ ఖర్చుల కింద ఏకంగా రూ. 3 లక్షలు కేటాయించారు. ప్రతియేటా బేసిక్ శాలరీ మీద 5వేల ఇంక్రిమెంటును మంజూరు చేసుకున్నారు.

తామంతా అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చామని, అందువల్ల ప్రస్తుతం వస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని, తమకు వేరే ఆదాయం ఏమీ లేదని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పదో తేదీకల్లా జీతం అయిపోతోందని, నియోజకవర్గాల్లో కార్యాలయాలు, సిబ్బందికి జీతాలు.. ఇవన్నీ మోయలేని భారం అయిపోతున్నాయని సంజీవ్ ఝా అనే ఎమ్మెల్యే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement