నూతన సైన్యాధిపతిగా దల్బీర్‌సింగ్? | Sakshi
Sakshi News home page

నూతన సైన్యాధిపతిగా దల్బీర్‌సింగ్?

Published Mon, Apr 21 2014 3:42 AM

నూతన సైన్యాధిపతిగా దల్బీర్‌సింగ్?

 న్యూఢిల్లీ: బీజేపీ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్మీ తదుపరి చీఫ్ నియామకంలో కేంద్రం ముందుకే వెళుతోంది. ప్రస్తుతం ఉప సైన్యాధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును ఆర్మీ చీఫ్ పదవికి సిఫారసు చేస్తూ రక్షణ శాఖ ప్రధాని కార్యాలయానికి ఫైలు పంపింది. ఇందుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాల అధిపతులు ఉద్యోగ విరమణకు కనీసం రెండు నెలల ముందే, కొత్తవారి పేరును ఖరారు చేయడం ఆనవాయితీ. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ పదవీ కాలం జూలై 31తో ముగిసిపోతోంది.

 బీజేపీ అభ్యంతరాలు బేఖాతరు: అధికారం నుంచి దిగిపోయే ముందు కేంద్రం కీలక పదవులను భర్తీ చేయడం సరికాదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే ఆర్మీ చీఫ్ నియామకాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని డిమాండ్ చేసింది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్న మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ కూడా... కొత్త ఆర్మీ చీఫ్ నియామకం విషయంలో ప్రభుత్వానికి అంత తొందరెందుకని ప్రశ్నించారు. కాగా, వీకే సింగ్ సైన్యాధిపతి ఉన్న సమయంలో దల్బీర్‌సింగ్ సుహాగ్‌పై క్రమశిక్షణ, నిఘాపరమైన నిషేధం విధించారు. 3 కోర్ కమాండర్‌గా ఉన్న దల్బీర్ తన పరిధిలోని నిఘా విభాగం నిర్వహణలో విఫలమైనందుకు చర్య తీసుకున్నారు. బిక్రంసింగ్ చీఫ్‌గా వచ్చిన తర్వాత దల్బీర్‌పై నిషేధాన్ని తొలగించారు.
 

Advertisement
Advertisement