రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా? | Sakshi
Sakshi News home page

రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా?

Published Fri, Apr 21 2017 7:03 PM

రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా? - Sakshi

సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం, కార్యదర్శి నారాయణ
జంతర్‌మంతర్‌లో తమిళ రైతుల ధర్నాకు సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ

రైతుల ఆకలి కేకలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రైతుల సమస్యలపై జంతర్‌మంతర్‌ వద్ద 39 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన దీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ రైతుల అసాధారణ పోరాటానికి సీపీఐ మద్దతు తెలుపుతోందన్నారు. కావేరీ డెల్టాలో మూడేళ్లుగా తీవ్ర కరువు వల్ల 400 మంది చనిపోయారని, ఆకలి చావులు, కరువు చావులు బాధాకరమైన అంశమని పేర్కొన్నారు.

రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక, తక్షణ ఉపశమన చర్యలను చేపట్టడం లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం, రుణమాఫీ, పంటల నష్టపరిహారం వంటి అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేసినా కేంద్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తిండి, నిద్ర లేకుండా ఢిల్లీ ఎండల్లో మాడుతున్న రైతుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఇకనైనా చొరవ చూపాలని కోరారు. కేంద్రప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని నారాయణ విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రధానమంత్రి వెంటనే వాటిని అమలు చేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement