
న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రభావం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి.
అలాగే గత 24 గంటల్లో 120 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్‌కరోనా కేసులు 53,946 కాగా, 34,108 మంది బాధితులు చికిత్సతో కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 37.51 శాతానికి పెరగడం కొంతలో కొంత ఊరట కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.
మూడు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 30,706, గుజరాత్‌లో 10,988, తమిళనాడులో 10,585 పాజిటివ్ కేసులు బహిర్గతం అయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం మరణాలు 2,872 కాగా, ఇందులో 1,135 మరణాలు కేవలం మహారాష్ట్రలో సంభవించాయి. గుజరాత్‌లో 625 మంది, మధ్యప్రదేశ్‌లో 243, పశ్చిమ బెంగాల్‌లో 232, ఢిల్లీలో 129, రాజస్తాన్‌లో 126, ఉత్తరప్రదేశ్‌లో 104, తమిళనాడులో 74 మంది కరోనా బారినపడి మృతి చెందారు.
13.6 రోజుల్లో రెట్టింపు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యేందుకు ప్రస్తుతం 13.6 రోజుల సమయం పడుతోందని ఆరోగ్యశాఖ తెలి పింది. 14 రోజుల నుంచి 11.5 రోజులుగా ఉన్న ఈ గడువు గత మూడు రోజులుగా 13.6 రోజులకు చేరిందంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 3.1 శాతమని పేర్కొంది. దేశంలో 8 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని తెలిపింది. కరోనా కేసులు 106 రోజుల్లో 80 వేల మార్కును దాటాయని, అభివృద్ధి చెందిన యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఇందుకు 44–66 రోజుల సమయం పట్టిందని పేర్కొంది.