వార్తా పత్రికలతో కోవిడ్‌ సోకదు

Covid-19 Does Not Infect with Newspapers - Sakshi

భయపడాల్సిన అవసరం లేదు

కోవిడ్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాలు నకిలీ వార్తలతో నిండిపోతున్నాయి. వార్తా పత్రికలను తాకితే కోవిడ్‌ వస్తుందంటూ ఓ నకిలీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాలను ప్రజల్లోకి వెళ్లాలంటే వార్తా పత్రికలు తప్పనిసరి. సమాజంలో ఉన్న అన్ని రకాల తారతమ్యాలను పరిగణనలోకి తీసుకున్నా వార్తా పత్రికలు కచ్చితంగా సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన తరుణమిది. ప్రధాని కూడా దీన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వార్తా పత్రికలను ముట్టుకుంటే కోవిడ్‌ సోకుతుందన్న నకిలీ వార్త వ్యాప్తిలోకి రావడం విచారించదగ్గ విషయం. వాస్తవానికి పత్రికలతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందనేందుకు శాస్త్రీయ ఆధారమేదీ లేదు.

నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మాట..
అమెరికాలోని ప్రిన్స్‌టన్  యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌తో నిర్వహించిన అధ్యయనం ప్రకారం కోవిడ్‌ వేర్వేరు ఉపరితలాలపై వేర్వేరు కాలం మనుగడ సాగించింది. గత వారం న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం కార్డ్‌బోర్డు, రాగి వంటి వాటిపై వైరస్‌ తక్కువ కాలం బతుకుతుంది. కార్డ్‌బోర్డులో సూక్ష్మస్థాయి కన్నాలు ఉండటం ఇందుకు ఓ కారణం. ఈ వైరస్‌లు నున్నటి, కన్నాలులేని ఉపరితలాలపై ఎక్కువకాలం జీవిస్తాయని కూడా పరిశోధన స్పష్టం చేసింది. గాలి సోకినప్పుడు ఈ వైరస్‌ తీవ్రత తగ్గుతూ పోతుందని, ప్రతి 66 నిమిషాలకు వైరస్‌ సామర్థ్యం సగం తగ్గుతుందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. కార్డ్‌ బోర్డు, కాగితం నిర్మాణానికి సారూప్యత ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంది..?
వార్తా పత్రికలను ముట్టుకుంటే కోవిడ్‌ వ్యాపిస్తుందనడంలో వాస్తవం ఏమాత్రమూ లేదు. కోవిడ్‌ కేసులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కోవిడ్‌ బారిన పడ్డ వ్యక్తి కాగితాల ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేయలేరని.. రకరకాల పరిస్థితులు, వాతావరణాల నుంచి వచ్చినా ఇబ్బందేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రశ్నోత్తరాల కాలమ్‌లో స్పష్టంగా తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) కూడా వార్తా పత్రికలు అందివ్వడం, అందుకోవడం వంటి చర్యల వల్ల కోవిడ్‌ వ్యాప్తి చెందదని తెలిపింది.

సూర్య కిరణాలతో శక్తివిహీనం!
వాషింగ్టన్  పోస్ట్‌ కథనం ప్రకారం ఈ వైరస్‌ సూర్యుడి నుంచి వెలువడే పరారుణ కాంతి కిరణాలకూ శక్తిని కోల్పోతుంది. ఒకవేళ వైరస్‌ ఉన్న వ్యక్తి నుంచి కొంత వైరస్‌ కాగితంపైకి చేరినా వాటితో సమస్య ఉత్పన్నం కాదని సాంక్రమిక వ్యాధుల నిపుణుడు గారీ విటేకర్‌ తెలిపారు. శరీరపు సహజ రోగ నిరోధక వ్యవస్థను ఛేదించి లోనికి ప్రవేశించాలంటే భారీగా వైరస్‌లు కావాల్సి ఉంటుందని వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top