లాక్‌డౌన్‌ సడలింపు: మహమ్మారి విజృంభించవచ్చు!

Could Covid 19 Silently Infected Far More Than Reported What Study Says - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మంది ప్రాణాలను బలిగొంది. ప్రాణాంతక వైరస్‌ బారిన పడి లక్షలాది మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటున్నాయి. అయితే కొన్నిచోట్ల ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెల్లడిస్తున్న సమాచారం ఆధారంగా కరోనా వ్యాప్తి- ప్రభావం- తదితర అంశాల గురించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. లాక్‌డౌన్‌ సడలింపుతో వైరస్‌ విజృంభించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

డేటా అనలిస్టుల అంచనా ప్రకారం మార్చి 22 నుంచి ఏడు రోజుల పాటు భారత్‌లో 16,800- 23, 600 కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఇందుకు విరుద్ధంగా కేవలం 2395 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే విధంగా ఏప్రిల్‌ 11 నాటికి 119 నుంచి 567 మరణాలు సంభవిస్తాయని అంచనా వేయగా.. శనివారం నాటికి 288 మంది మృత్యువాత పడ్డారు. ఇక బుధవారం నాటికి 423 మంది మృతి చెందగా.. 12330 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. (లాక్‌డౌన్‌ సడలించే రంగాలు ఇవే..)

ఈ విషయం గురించి ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ పరిశోధన బృందంలో ఒకరైన సంగీత భాటియా ఓ జాతీయ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘ప్రతీ దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తగిన సామర్థ్యం లేదు. కాబట్టి నమోదయ్యే కేసులకు, వైరస్‌ సోకిన వారి సంఖ్యలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఎవరికి పరీక్షలు నిర్వహించాలనే అంశంపై కూడా స్పష్టత లేదు. భారత్‌ విషయాన్ని తీసుకుంటే... అక్కడ మొదట్లో కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే పరీక్షలు నిర్వహించారు. చాపకింద నీరులా విస్తరించే కరోనాను కట్టడి చేయడం అంత తేలికైన విషయం కాదు’’అని పేర్కొన్నారు. కోవిడ్‌-19కు సంబంధించిన ప్రతీ మరణం, కేసు లెక్కలోకి తీసుకున్నట్లయితే.. వాటి నిష్పత్తి ఆధారంగా ట్రాన్స్‌మిషన్‌ కేసుల సంఖ్యను అంచనా వేయవచ్చు అని అభిప్రాయపడ్డారు. ఈ డేటా ఆధారంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆస్పత్రి బెడ్స్‌, అవసరమైన వైద్య సిబ్బంది గురించి ముందే అవగాహనకు రావొచ్చని వెల్లడించారు. (ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు)

ఇక కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించే నాటికి ఒక కరోనా పేషెంట్‌ ద్వారా వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ జరిగే సంఖ్య సగటున 3.1 అని డేటా అనలిస్టులు అంచనా వేశారు. అంటే కరోనా సోకిన ఒక వ్యక్తి కనీసంగా ముగ్గురికి దానిని వ్యాప్తి చేయగలడు. అయితే భారత్‌లో ప్రస్తుతం విధించిన నిబంధనల వల్ల గత వారం నాటికి ఈ సగటు 1.5 నాటికి తగ్గిందని భారత వైద్య పరిశోధన మండలి పేర్కొంది. ఈ సగటు ఒకటి కంటే తక్కువకు చేరితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేసింది. కాగా ప్రస్తుతం కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపునిచ్చిన తరుణంలో ఈ సగటు మరోసారి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top