 
															కనకపుర వద్ద కనిపించిన ఏడుతలల పాముపొర
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కనకపుర తాలూకా మరిగౌడనదొడ్డి గ్రామంలోని ఒక పొలంలో లభించిన ఏడు తలల పాముపొర వివాదాస్పదంగా మారింది. పాముపొర గురించి రోజుకో విధమైన భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరను పరిశీలించిన సరీసృపాల నిపుణులు ఇదంతా మానవ నిర్మితమని, ఎవరో కావాలని ఇలా గిమ్మిక్ చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. గ్రామంలోని మరిగౌడ అనే వ్యక్తికి చెందిన పొలంలో సుమారు నెల రోజుల క్రితం ఈ ఏడు తలల పాముపొర లభించింది. పురాణాల్లో కూడా అక్కడక్కడా ఏడు తలల పాముల గురించి ప్రస్తావన ఉండడంతో జనం త్వరగా ఆకర్షితులై పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసారు. త్వరలో దేవాలయం నిర్మించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు.
గత వారం బీబీఎంపీకి చెందిన వన్యప్రాణుల సంరక్షకులు మోహన్, జయరాజ్, ప్రసన్న మీడియాతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి పాముపొరను పరీక్షించారు. అనంతరం మాట్లాడిన వారు ఇది ఏడు తలలపాము పొరకాదన్నారు. ఎవరో కావాలని కొన్ని పాముల పొరలను సేకరించి ఇలా ఏడు తలల పాముగా చిత్రీకరించారన్నారు. నిజానికి ఏడు తలలపాము అవాస్తవమని, ఒకవేళ అవి పుట్టినా బతకవన్నారు. అయితే పాముపొర లభించిన భూమి యజమానిగా చెప్పుకుంటున్న మరికెంపేగౌడ మాత్రం ఈ భూమి తనదేనని, ఏడు తలల పాము తిరగడం తన కళ్లతో చూసానని వాదిస్తున్నాడు. ఏదిఏమైనా ఏడుతలల పాముపొర వివాదం ఎక్కడకు వెళ్లి ముగుస్తుందో చూడాలి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
