
ముంబై: ప్రయాణికుల్ని తరలించే డ్రోన్ల తయారీతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ను తగ్గించవచ్చని కేంద్ర విమానయాన సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఐఐటీ విద్యార్థులు ఈ డ్రోన్లకు సంబంధించి అధునాతన పరికరాలను అభివృద్ధి చేయవచ్చని వెల్లడించారు. ఆదివారం ఐఐటీ–బాంబే నిర్వహించిన టెక్‌ఫెస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో డ్రోన్ల తయారీరంగం వేగంగా విస్తరించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రయాణికుల్ని తీసుకెళ్లే డ్రోన్ల రూపకల్పనపై పలువురు దృష్టి సారించారనీ.. ఈ రంగంలో భారీ వాటా పొందేందుకు మనం కూడా దేశీయంగా ఆ తరహా డ్రోన్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. సమర్థవంతంగా డ్రోన్లను తయారుచేయగలిగితే వాటి రవాణా వ్యయం ఆటో ప్రయాణానికయ్యే స్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. తగిన చర్యలు తీసుకుంటే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ నిలుస్తుందని సిన్హా తెలిపారు.