ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్ సింగ్ (58) అనే సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన మంగళవారం రాత్రి విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనుహ్యంగా బిజ్వాసన్ లోని సీఐఎస్ఎఫ్ క్యాంపులో తన సర్వీసు తుపాకీతో తనను కాల్చుకున్నాడు. ఫలితంగా మూడు బుల్లెట్లు తగిలాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. రాజ్ సింగ్ 1980 నుంచి సీఐఎస్ఎఫ్లో చేరి విధులు నిర్వర్తించాడు.