4వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి..

Child Fall From 4th Floor In Mumbai Thanks To Tree To A Tree - Sakshi

ప్రాణం పోయే పరిస్థితుల్లో నుంచి బయటపడితే ఏమంటాం.. అద్భుతమే జరిగింది. భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి అంటాం. చిన్న పిల్లల విషయంలోనైతే చిరంజీవి అంటాం. ముంబైకి చెందిన అధర్వాను ఇప్పుడందరూ చిరంజీవి అని పిలుచుకుంటున్నారు. పిల్లాడికి తిరిగి జీవితాన్ని ప్రసాదించిన ఆ చెట్టును సంజీవని అంటున్నారు.

సాక్షి, ముంబై : నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డ 14 నెలల అధర్వా బర్కాడే అలియాస్‌ శ్రీ అనే బాలుడికి ఓ చెట్టు పునర్జన్మనిచ్చింది. చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేలా చేసింది. వివరాలు.. అధర్వా అలియాస్ శ్రీ కుటుంబం గోవంధిలోని దేవాశి రోడ్డులో గల గోపికృష్ణన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. గురువారం ఉదయం శ్రీ నానమ్మ ఫ్రెంచ్‌ కిటీకీ తెరచి బట్టలు ఆరబెట్టింది.కానీ, హడావుడిలో గడియ సరిగా పెట్టలేదు. కొత్త భవనం కావడంతో దానికి గ్రిల్స్‌ బిగించలేదు. అదే గదిలో ఆడుకుంటున్న శ్రీ కిటికీ వద్దకు చేరుకున్నాడు. రక్షణగా ఉన్న రెండు ఫీట్ల ఎత్తున్న తేలికపాటి చెక్కను తొలగించడంతో ఆ ఫ్రెంచ్‌ కిటికీ నుంచి నుంచి కిందపడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పరుగు పరుగున కిందకి చేరుకున్నారు. అయితే, శ్రీ కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని ఓ చెట్టు ఉండడంతో.. పిల్లాడు నేరుగా కిందపడలేదు. ఆ చెట్టు కొమ్మలపై పడి నేలను చేరడంతో తీవ్ర గాయాలు కాలేదు.

తమ కుమారుడికి ఏమైందోనని తల్లిదండ్రులు అజిత్‌, జ్యోతి వచ్చి భోరున విలపించారు. బాలుడు స్పృహలోనే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్రీకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. పెదవి, కాలికి గాయాలయ్యాయని తెలిపారు. చెట్టుపై పడడంతోనే పిల్లాడికి పెద్దగా గాయాలు కాలేదని అన్నారు. కాగా, బాలుడి తండ్రి చెట్ల పెంపకానికి వినియోగించే ఎరువులు, మట్టి, పేడ వ్యాపారం చేస్తుండడం విశేషం. పిల్లాడి ప్రాణాలు కాపాడిన ఆ చెట్టుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top