ప్రేమ కోసం మతం మార్చుకున్నాడు.. కానీ

Chhattisgarh Man Converts To Hinduism To Get Married But She Refused Him - Sakshi

రాయ్‌పూర్‌ : ప్రేమించిన అమ్మాయి కోసం మతం మారాడు.. అనంతరం తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడా యువతి తల్లిదండ్రులే కావాలని కోరుకుంటోంది. మేజర్‌ అయిన ఆ యువతి కోరికను కాదనలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దాంతో సదరు వ్యక్తి ‘నీ కోసం నేను మతం మార్చుకుంటే.. తల్లిదండ్రుల కోసం నువ్వు మనసు మార్చుకున్నావ్‌.. నన్ను ఒంటరిని చేశావం’టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అంజలి జైన్‌(23), మహ్మద్‌ ఇబ్రహీం సిద్ధిఖి (33)లు ప్రేమించుకున్నారు. వేరే మతస్తున్ని వివాహం చేసుకుంటే తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, అందువల్ల సిద్ధిఖిని మతం మారాల్సిందిగా అంజలి కోరింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23 న సిద్ధిఖి ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారాడు. మహ్మద్‌ సిద్ధిఖి కాస్తా ఆర్యన్‌ ఆర్యగా మారాడు. అనంతరం అంజలి, ఆర్యన్‌లు ఫిబ్రవరి 25న హిందూ సాంప్రదాయం ప్రకారం రాయ్‌పూర్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

అనంతరం అంజలి తమ వివాహం గురించి ఇంట్లో వారిని ఒప్పిస్తానని చెప్పడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. జూన్‌లో అంజలి తన వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, తన భర్త దగ్గరకు చేరుకుంది. దాంతో అంజలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు అంజలిని ఆమె భర్త దగ్గర నుంచి తీసుకువచ్చి మహిళా పోలీసు కస్టడికి అప్పగించారు. దాంతో సిద్ధిఖి హైకోర్టును ఆశ్రయించాడు.

లోకల్‌ పోలీసులు తన భార్యను తన నుంచి దూరం చేసి బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు దగ్గరకు పంపించారని, ఆమెను తనకు చూపించాల్సిందిగా కోర్టును అభ్యర్ధిస్తూ ‘హెబియస్‌ కార్పస్‌’ పిటిష్‌న్‌ దాఖలు చేశాడు. విచారణ సమయంలో అంజలి మేనమామ.. సిద్ధిఖికి ఇంతకు ముందే వివాహం అయ్యిందని తెలిపాడు. ఇప్పుడు అంజలిని అతనితో పంపితే ప్రమాదం కాబట్టి ఆమెను తన తల్లిదండ్రులతో ఉండేలా ఆదేశించాల్సిందిగా కోర్టును కోరాడు. కానీ సిద్ధిఖి తనకు గతంలోనే వివాహం అయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నానని.. ఈ విషయాలన్ని అంజలికి తెలుసని తెలిపాడు. కనుక ఆమెను తనతో పంపించాల్సిందిగా కోరాడు.

ఇరు పక్షాల వాదనలు విన్న  హై కోర్టు అంజలి తన తల్లిదండ్రులతో ఐనా ఉండవచ్చు లేదా గవర్నమెంట్‌ గర్ల్స్‌ హస్టల్‌లోనైనా ఉండవచ్చంటూ తీర్పునిచ్చింది.  దాంతో సిద్ధిఖి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సిద్ధిఖి విచారణను పరిశీలించడానికి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అధ్యర్యంలో ఒక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫిర్యాదు విచారణ సమయంలో అంజలిని ప్రవేశపెట్టాల్సిందిగా దీపక్‌ మిశ్రా, దమ్‌తారి జిల్లా పోలీస్‌ సుపరిండెంట్‌ను ఆదేశించారు.

విచారణకు హాజరైన అంజలి తాను తన తల్లిదండ్రులతో కలసి ఉండాలనుకుంటున్నట్లు, ఇందులో ఎవరి బలవంతం లేదని తెలిపింది. దాంతో సుప్రీం కోర్టు అంజలి మేజర్‌ అయినందున ఆమెకు తనకు ఇష్టం వచ్చిన వారితో ఉండే హక్కు ఉంది కనుక ఆమెను తన భర్తకు వద్దకు వెళ్లాలని ఆదేశించలేమంది. ఈ అనుకోని మలుపుకు షాక్‌కు గురైన సిద్ధిఖి ‘నేను తన కోసం మతం మార్చుకున్నాను. కానీ ఆమె తన తల్లిదండ్రుల కోసం మనసు మార్చుకుంది. తన తల్లిదండ్రుల బలవంత మేరకే ఆమె అలా మాట్లాడింద’ని సిద్ధిఖి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top