ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట | chennai floods: long queues at ATMs, petrol pumps | Sakshi
Sakshi News home page

ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట

Dec 5 2015 1:55 PM | Updated on Sep 3 2019 9:06 PM

ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట - Sakshi

ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట

రోడ్ల మీద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి.

దాదాపు వారం రోజులకు పైగా విపరీతమైన వర్షాలు, వరదలతో అల్లాడుతున్న చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరం పాక్షికంగా సాధారణ స్థితికి చేరువ అవుతోంది. రోడ్ల మీద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వరుసపెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు సుమారు 245 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, రైలు మార్గాలు పాడవ్వడం, విమానాశ్రయంలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ఆకాశ మార్గం కూడా మూసుకుపోయింది.

కొట్టుపురం, ముడిచూర్, పల్లిక్కరనై లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కొరత పట్టి పీడిస్తోంది. అతి కొద్దిసంఖ్యలో మాత్రమే ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరవడంతో.. వాటివద్ద పొడవాటి క్యూలైన్లు కనపడుతున్నాయి. రెండు రోజుల్లో చాలావరకు పెట్రోలు బంకులు తెరుస్తారని, ప్రజలు ఆందోళన చెందవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అయినా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పారు.

ఎప్పుడూ బిజీగా ఉండే ఎగ్మూర్ - తాంబరం స్టేషన్ల మధ్య రైళ్లు నడిపిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. దాంతో స్థానికులకు చాలావరకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. తాంబరం సహా చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ ల్యాండ్‌లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మొబైల్ సేవలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాంతో సహాయ పనులకు ఆటంకం కలిగింది. కూరగాయలు, పాలు మాత్రం ఇంకా కొరతగానే ఉండటంతో వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement