
భవన నిర్మాణాలకు 25 మార్గదర్శకాలు
పట్టణ, నగర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల...
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
- అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు
- నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల ప్రాణనష్టం
- నిత్యావసర ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
సాక్షి, బెంగళూరు : పట్టణ, నగర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల అడ్డుకట్టుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన విధివిధానాలను అమల్లోకి తీసుకు వస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. బెంగళూరులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోందన్నారు. అదే విధంగా నిర్మాణంలో సరైన నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో 25 నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకు రానుందన్నారు. వీటిని పాటించని బిల్డర్లతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే నిర్మించిన భవనాలను కూలగొట్టాలా? లేక వాటిని సక్రమంగా గుర్తించాలా? అందుకు అనుసరించాల్సిన విధివిధానాలు తదితర విషయాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెల్లడించనుందన్నారు. గత పదేళ్ల యూపీఏ పరిపాలన, ఆర్థిక విధానాలపై శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా దేశంలోని ప్రజలందరికీ యూపీఏ పాలనలో అభివృద్ధి ఏ దిశలో సాగిందనే విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు.
అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉత్పాదన రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయన్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. నిత్యావసరధరల పెరుగుదలను నియంత్రించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని దేశాలు, మతాలు, జాతులు ఏక తాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే ఉగ్రవాదాన్ని రూపుమాపగలమని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తోపాటు పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొన్నారు.