'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్‌డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది.
'భారత మాతాకీ జై అంటే సమస్యలు పరిష్కారం కావు: శివసేన
Apr 7 2016 7:24 PM | Updated on Sep 3 2017 9:25 PM
ముంబై: 'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్‌డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సత్వరచర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'భారతమాతాకీ జై' అని నినదిస్తూ తన సీటును కాపాడుకోలేరని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటుగా విమర్శించింది.
గత ప్రభుత్వాలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమేనని తెలిపింది. యువతలో అసహనం పెరిగి మావోయిజం వైపు ఆకర్షితులవుతున్నారని ఇలాంటి పరిసితుల్లో 'భారత మాతాకీ జై' అనే నినాదాలు చేస్తే లాభం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది.
ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 రోజులకొకసారి కూడా తాగునీరు రావడంలేదని, పుణే, థానె, నాగపూర్, ముంబైల్లో పరిస్థితి దారుణంగా ఉందని రాష్ట్రం స్మశానాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలు మూతపడుతున్నాయని, దేశభక్తి పేరుతో ప్రజల దాహం తీర్చలేమంటే సహించేదిలేదని హెచ్చరించింది.
Advertisement
Advertisement