అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

Centre Sends General Advisory to All States AHead Of Ayodhya Verdict - Sakshi

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న చరిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ఇదివరకే సూచించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పులో స్పందించిన విషయం తెలిసిందే.

ఇక సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతి భద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్‌ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో ఆ లోపు రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. 17వ తేదీలోగా సుప్రీంకోర్టు పని దినాలు కూడా తక్కువగా ఉండడంతో ఏ రోజైనా సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top