కళ్లముందు మృత్యువు..లాస్ట్‌ ఫోన్‌ కాల్‌ 

 Brother, Going To Die Today: Delhi Fire Victim In Last Phone Call - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని అత్యంతర  రద్దీగా ఉండే అనాజ్ మండి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కార్మికుల జీవితాలు క్షణాల్లో బుగ్గి పాలైపోయాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న కార్మికులు రక్షించాలని ఆర్తనాదాలు చేస్తుంటే..ఒక కార్మికుడు మాత్రం తన ప్రాణం కంటే తన వారి గురించే ఆలోచించాడు. మృత్యువు కళ్లముందే వికటాట్ట హాసం చేస్తోంటే.. నిస్సహాయంగా తన  సోదరుడికి  ఫోన్‌ చేసిన వైనం  పలువురిని కంట తడి పెట్టిస్తోంది.

అన్నా నేను చచ్చిపోతున్నా..దయచేసి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో..నాకు ఊపిరి ఆడటం లేదు. రేపు వచ్చి నన్ను (నా మృతదేహాన్ని) తీసుకెళ్లు.. నా ఫ్యామిలీ జాగ్రత్త అంటూ ఢిల్లీ అనాజ్ మండీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు  ఉత్తర్ ప్రదేశ్, బిజినోర్‌కు చెందిన ముషారఫ్ అలీ(30)  తన  సోదరుడికి మొర పెట్టుకున్నాడు. తన భార్య, నలుగురు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడిని వేడుకున్నాడు.

అయితే ఏదో విధంగా తప్పించుకోమ్మని అన్న సూచించారు. లేదు.. ఎటు చూసినా మంటలే.. తప్పించుకునే మార్గం లేదు..ఊపిరి ఆడటం లేదు. బతకడం కష్టం.. మరో రెండు, మూడు నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. దేవుడి దయ ఉంటే బ్రతుకుతా.  చనిపోయిన విషయాన్ని ముందు ఇంట్లోని పెద్దవాళ్లకి చెప్పు.. నన్ను తీసుకెళ్లండి.. చనిపోయినా నేను మీతోనే ఉంటానంటూ సోదరుడికి చెప్పాడు. అలీకి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతను గత నాలుగు సంవత్సరాలుగా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఢిల్లీ ఝాన్సీరాణి రోడ్‌లోని ఇరుకైన మూడంతస్థుల భవనంలో ఉన్న బ్యాగులు, బాటిళ్లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్నినింపింది. కార్మికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ప్రమాదంలో 43 మంది  ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

మళ్లీ అంటుకున్న మంటలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top