అత్యంత ఎత్తయిన రహదారి | BRO builds world's highest motorable road at 19,300 feet in Ladakh | Sakshi
Sakshi News home page

అత్యంత ఎత్తయిన రహదారి

Nov 3 2017 1:44 AM | Updated on Nov 3 2017 1:44 AM

BRO builds world's highest motorable road at 19,300 feet in Ladakh - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఒకటి ‘ఉమ్లింగ్లా టాప్‌’అనే ప్రాంతం. వేసవిలో మైనస్‌ 10 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఇక చలికాలంలోనైతే ఏకంగా మైనస్‌ 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే సరిహద్దు ప్రదేశం అది. ఆక్సిజన్‌ స్థాయిలు అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటాయి. ఇక అక్కడ నివాసమనేది ఊహించుకోవడానికీ కుదరని విషయం. అలాంటి ప్రాంతంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) వాహనాలు ప్రయాణించేందుకు అనువుగా ఉండేలా రహదారి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా రికార్డుల్లోకి ఎక్కింది.

ఈశాన్య ప్రాంతంలోని ఇండో–చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్‌చోక్‌ గ్రామాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. అలాగే లేహ్‌ ప్రాంతానికి 230 కి.మీ. దూరంలోనే ఈ రెండు గ్రామాలు ఉన్నాయని బీఆర్‌ఓ అధికారి తెలిపారు. రహదారి నిర్మాణ సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితులు ఆటంకంగా మారాయని.. ఇక్కడ పనిచేసే పనివాళ్లు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్‌ కోసం కిందకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. అంతేగాక ఇక్కడ పనిచేసిన వాళ్లలో చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని.. జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు కూడా గురయ్యారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్‌ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ హిమాంక్‌ అధికారి డీఎమ్‌ పుర్విమత్‌ తెలిపారు. అయినా దేశ ప్రయోజనాల కోసం తమ సిబ్బంది కష్టపడి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement