ప్రారంభమైన బోగిబీల్‌... ప్రత్యేకతలెన్నో! | Bogibeel Bridge Inaugurated In Assam | Sakshi
Sakshi News home page

Dec 25 2018 1:45 PM | Updated on Dec 25 2018 5:10 PM

Bogibeel Bridge Inaugurated In Assam - Sakshi

గువహటి : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బోగిబీల్‌ రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే పొడవైన రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిగా నిలిచింది బోగిబీల్‌ బ్రిడ్జి. బ్రహ్మపుత్ర నది మీద అస్సాంలోని దిబ్రూఘర్‌, ధేమాజీ జిల్లాల నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని వల్ల 170 కిలోమీటర్ల దూరంతో పాటు,  4 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికలను, ఫైటర్‌ జెట్ల ల్యాండింగ్‌లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్‌ బ్రిడ్జిని నిర్మించారు.

ఈ బ్రిడ్జ్‌కు సంబంధించి విశేషాలు..
1. స్వీడన్‌, డెన్మార్క్‌ల మధ్య నిర్మించిన వంతెన ఆధారంగా 1997లో ఈ బ్రిడ్జ్‌ని డిజైన్‌ చేశారు. భారతదేశంలోనే పూర్తిస్థాయిలో వెల్డింగ్‌ చేసిన బ్రిడ్జిగా మాత్రమే కాక యూరోపియన్‌ కోడ్స్‌, వెల్డింగ్‌ స్టాండర్డ్‌ని పాటించిన తొలి బ్రిడ్జిగా బోగిబీల్‌ బ్రిడ్జి నిలిచింది. పూర్తిగా వెల్డింగ్‌ చేయడం వల్ల దీనికి నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందంటున్నారు ఇంజనీర్లు.

2.  బోగిబీల్‌ బ్రిడ్జి​ ఆసియాలోనే రెండో అతి పొడవైన బ్రిడ్జిగా నిలిచింది. దీని జీవితకాలం 120 సంవత్సరాలు.

3. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కింది భాగంలో రెండు రైల్వే ట్రాక్‌లు ఉండగా.. పై భాగంలో మూడు రోడ్‌ ట్రాక్‌లను నిర్మించారు. వీటి వల్ల ఢిల్లీ నుంచి దిబ్రూఘర్‌ మధ్య ప్రయాణ కాలం మూడు గంటలు తగ్గుతుంది.

4. బ్రిడ్జి ప్రారంభంతో పాటు మోదీ తిన్సుకియా - నహర్లాగున్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా ప్రారంభించారు. ఇది వారంలో ఐదు రోజులు నడుస్తుంది.

5. తొలుత దీన్ని రూ. 3, 200 కోట్ల బడ్జెట్‌తో 4. 31 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని భావించారు. కానీ తరువాత దీన్ని 4. 9 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ఫలితంగా బడ్జెట్‌ రూ. 5, 900 కోట్లకు చేరింది.

6. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ 1997, జనవరి 22న ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పని ప్రారంభించారు. నేడు వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.

7. బ్రహ్మపుత్ర నదిలో నవంబర్‌ నుంచి మార్చి నెలల్లో వచ్చే వరదల వల్ల దాదాపు 5 నెలల పాటు  పనులకు అంతరాయం ఏర్పడిందని అందువల్లే బ్రిడ్జి నిర్మాణానికి ఇంత ఆలస్యమయ్యిందని ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మోహిందర్‌ సింగ్‌ తెలిపారు.

8. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపు 30 లక్షల బస్తాల సిమెంట్‌ను వాడినట్లు తెలిపారు. ఇది దాదాపు 41 ఒలంపిక్‌ స్విమ్మింగ్‌ పూల్ల నిర్మాణానికి సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో కోసం దాదాపు 19, 205 మీటర్ల స్టీల్‌ను వాడారు. ఇది ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తుకు రెండింతలన్నారు.

9. ఈ ప్రాజెక్ట్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అంజా, చాంగ్‌లాంగ్‌, లోహిత్‌, లోయర్‌ దిబాంగ్‌ వాలీ, దిబాంగ్‌ వాలీ, తిరాప్‌ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. దాంతో పాటు అస్సాంలోని దిబ్రూఘర్‌, ధెమాజీ జిల్లాల ప్రజలు కూడా లాభపడనున్నారు.

10. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికకు, ఫైటర్‌ జెట్ల ల్యాండింగ్‌లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్‌ బ్రిడ్జి నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement