కరోనా అని తెలిస్తే జనాలు భయపడతారని.. | Sakshi
Sakshi News home page

మూడు గంటల పాటు రోడ్డుమీదే మృతదేహం

Published Sat, Jul 4 2020 9:47 AM

Body of Covid 19 Victim Remains Lying on Bengaluru Road for 3 Hours - Sakshi

బెంగళూరు: కరోనా పాడుగాను.. ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ.. జనాలను ఆగమాగం చేస్తోంది. కనీసం కడసారి చూపు కూడా దక్కనివ్వడం లేదు. కోట్లకు అధిపతి అయిన కాటికి వెళ్లేటప్పుడు నా అనుకునే నలుగురు మనుషులు వెంట రాలేని పరిస్థితులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రతి రోజు కరోనా మృతులకు సంబంధించి గుండె కలుక్కుమనే వార్త ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా బెంగళూరులో ఇలాంటి అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది. కరోనా పాటిజివ్‌గా తేలిన ఓ వ్యక్తి గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలి మరణించాడు. అంబులెన్స్‌ వచ్చేవరకు దాదాపు మూడు గంటల పాటు ఆ మృతదేహాం అలా రోడ్డు మీదనే ఉంది. ఎవరు అక్కడికి వెళ్లలేదు. వివరాలు.. 

దక్షిణ బెంగళూరుకు చెందిన ఓ 64 వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో శుక్రవారం అతడికి గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే అంబులెన్స్‌ కోసం కాల్‌ చేశాడు. పరిస్థితి వివరించి.. తమ ఇంటి దగ్గరకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. అంబులెన్స్‌ కోసం రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గ మధ్యలోనే గుండెపోటుతో రోడ్డు మీదే కుప్పకూలాడు. అలా మూడు గంటల పాటు ఆ వృద్ధుడి మృతదేహం రోడ్డు మీదనే ఉంది. ఆ తర్వాత అంబులెన్స్‌ అక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లింది. దీని గురించి మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘కరోనా అని తెలిస్తే... ఇరుగుపొరుగు వారు భయపడతారనే ఉద్దేశంతో నా భర్త ఎవరి సాయం తీసుకోలేదు. అంబులెన్స్‌కు కాల్‌ చేసి రమ్మని చెప్పాడు. రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు. (కాన్పూ కష్టమే!)

ఈ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బృహన్‌ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ)పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు. కమ్యూనికేషన్‌ లోపం వల్ల అంబులెన్స్‌ సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఆలస్యమయ్యిందని తెలిపారు. అదికాక ఆ రోజు సాయంత్రం వర్షాల వల్ల మరింత ఆలస్యం అయ్యిందన్నారు. కానీ ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతవారం కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ 50 ఏళ్ల వ్యక్తికి చికిత్స ఇవ్వడానికి దాదాపు 50 ఆస్పత్రులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతడికి ఇంటిలోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్‌-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. (సెప్టెంబర్‌–డిసెంబర్‌ మధ్య కరోనా తీవ్రరూపం ) 

Advertisement
Advertisement