సెల్ ఉంటే చాలు.. | BMC services available in mobile | Sakshi
Sakshi News home page

సెల్ ఉంటే చాలు..

Jul 27 2014 10:37 PM | Updated on Apr 3 2019 4:53 PM

మీ దగ్గర మొబైల్ ఉందా.. అయితే ఇంకేం.. మీకు ఇకపై కార్పొరేషన్ వరకు వెళ్లి నీటిపన్ను.. ఇంటిపన్ను.. ఆస్తిపన్ను.. ఇలా అన్ని రకాల పన్నులు కట్టేందుకు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

సాక్షి, ముంబై: మీ దగ్గర మొబైల్ ఉందా.. అయితే ఇంకేం.. మీకు ఇకపై కార్పొరేషన్ వరకు వెళ్లి నీటిపన్ను.. ఇంటిపన్ను.. ఆస్తిపన్ను.. ఇలా అన్ని రకాల పన్నులు కట్టేందుకు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ముంబైకర్లకు ఇకపై కార్పొరేషన్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.

వివిధ పన్నులు చెల్లించేందుకు కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూల్లో నిలబడి విలువైన సమయం, వ్యయప్రయాసలను పూర్తిగా తగ్గించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది. అందుకు బీఎంసీకి చెందిన మొబైల్ అప్లికేషన్ వచ్చే వారం నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి రానుంది.  ప్రారంభంలో నీటి పన్ను చెల్లించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

 ఆ తరువాత ఆస్తి, ఆదాయ  పన్నులతోపాటు అనుమతి ఇచ్చే శాఖలకు చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించేందుకు అప్లికేషన్‌లు ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు నమోదుచేసే సౌకర్యం కూడా నవంబర్‌లో ప్రవేశపెట్టనుంది. ‘ఎంసీజీఎం 24/7’ అనే అప్లికేషన్ అండ్రాయిడ్ మొబైల్‌పై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఎన్‌ఎన్ నంబర్ చేర్చగానే చెల్లింపు దారుడికి వివరాలు అందులో వస్తాయి. ఆ తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అలాగే ఐఎంపీఎస్ లాంటి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు.

పన్ను చెల్లించడానికి ఈ సేవలు అందిస్తున్న సంబంధిత కంపెనీకి దాదాపు ఒక శాతం అదనపు పన్ను విధిస్తారు. రుసుం చెల్లించగానే ఎస్‌ఎంఎస్ ద్వారా మనకు మెసేజ్ వస్తుంది. దీన్ని రసీదుగా భావించాల్సి ఉంటుందని మేయర్ సునీల్ ప్రభు స్పష్టం చేశారు. ఇదివరకే బీఎంసీ పరిపాలన విభాగం ముంబైకర్లకు కన్జ్యూమర్ కన్వీనియెన్స్ సెంటర్ (గ్రాహక్ సువిధ కేంద్రం) తోపాటు సైబర్ కన్వీనియెన్స్ సెంటర్‌లో పేమెంట్ గెట్ వే, బీఎంసీకి చెందిన ఆధీకృత వెబ్‌సైట్‌పై డబ్బులు చెల్లించడం, ఫిర్యాదు నమోదు చేయడం లాంటి సౌకర్యాలు కల్పించింది.

నేటి ఆధునిక కాలంలో ప్రస్తుతం అందరి వద్ద మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు గంటల తరబడి క్యూలో నిలబడి పన్నులు చెల్లించే ఓపిక ఉండదు. దీంతో తమ చేతిలో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు బీఎంసీ సౌకర్యాలు కల్పిస్తోందని మేయర్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement