త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు.
ముంబయి: త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. అతడు నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ అక్షరాల రూ.690కోట్లు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న ఈ ఎన్నికల్లో అతడే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలవనున్నాడు. వివరాల్లోకి వెళితే.. పరాగ్ షా అనే వ్యక్తి ఘట్కోపార్ ప్రాంతం నుంచి బీఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగాడు.
బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. ఇతడు మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. ఇప్పటి వరకు రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోయినా.. ఒక్కసారిగా తన అనూహ్య ఆస్తులు ప్రకటించి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు.
సొంతంగా మేన్ కన్‌స్ట్రక్షన్స్, మేన్ డెవలపర్స్ పేరిట ముంబయితోపాటు గుజరాత్, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ప్రాజెక్టు పనులు చేస్తుంటారు. ఈయన ఒక పెద్ద రియల్టర్ కూడా. రూ.670 కోట్లు చరాస్తులుగా, రూ.20 కోట్లు స్థిరాస్తులుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిల్లో కొన్ని తన భార్య పేరిట ఉన్నట్లు చెప్పాడు.