రాజీవ్‌ హంతకులకు క్షమాభిక్ష లేనట్లేనా..!

Banwarilal Purohit Not Interested To Free Rajiv Case Convicts - Sakshi

మాజీ ప్రధాని రాజీవ్‌ హంతకుల విడుదలకు గవర్నర్‌ నిరాకరణ..?

సీఎం పళనిస్వామికి గవర్నర్‌ మౌఖికంగా చెప్పినట్లు రాజ్‌భవన్‌ వర్గాల సమాచారం

అధికారికంగా ప్రకటించాలని కోరుతున్న వివిధ పార్టీలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష లేనట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హంతకుల విడుదలను నిరాకరిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ మౌఖికంగా చెప్పినట్లు శుక్రవారం ప్రచారం జరగడంతో చర్చనీయాంశం అయింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21న చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో ఎల్‌టీటీఈ మానవబాంబు చేతిలో హతమయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్, రవిచంద్రన్, రాబర్ట్‌పయాస్, జయకుమార్‌ తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వీరిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్‌లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నలుగురికి యావజ్జీవ శిక్షపడింది. ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీలు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే క్షమాభిక్ష అంశంపై అనేక ఏళ్లు నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యాన్ని కారణంగా చూపి ఆ ముగ్గురి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం ఏడుగురు ఖైదీలు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు పాతికేళ్లకుపైగా శిక్షను అనుభవించడంతో వారిని విడుదల చేయాలని 2014, 2016లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో తీర్మానం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది. భారత రాజ్యాంగం 161 సెక్షన్‌ కింద వారి విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. 

ఈ పరిణామం తరువాత ఏడుగురు ఖైదీల విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోరింది. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు సైతం మద్దతు పలికాయి. పోరాటాలు కూడా చేశాయి. చట్టనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి గత ఏడాది ఏప్రిల్‌లో మరోసారి కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపారు. అయితే తీర్మానాలు రాజ్‌భవన్‌కు చేరుకున్నా గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుమారు ఐదేళ్లుగా ఈ వ్యవహారం రాజ్‌భవన్‌లో నానుతుండగా, ఏడుగురు ఖైదీల విడుదల చేయరాదని గవర్నర్‌ నిర్ణయించినట్లుగా రాజ్‌భవన్‌ వర్గాల ద్వారా అనధికార సమాచారం శుక్రవారం బయటకు వచ్చింది. 

చట్టనిపుణులతో గవర్నర్‌ చర్చించిన తరువాతనే గవర్నర్‌ ఈ నిర్ణయానికి వచ్చారని, గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సైతం గవర్నర్‌ తోసిపుచ్చారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదు. ముఖ్యమంత్రి ఎడపాడికి గవర్నర్‌ మౌఖికంగా ఈ విషయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖైదీల విడుదల విషయంలో గవర్నర్‌ బన్వరిలాల్‌ నిర్ణయం ఏమిటో అధికారికంగా ప్రకటించాలని పీఎంకే నేత డాక్టర్‌ రాందాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాజీవ్‌ హంతకుల్లో ఒకరైన రవిచంద్రన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top