చెత్త రోడ్లతో 10 వేల మందికి పైగా మృతి! | Sakshi
Sakshi News home page

చెత్త రోడ్లతో 10 వేల మందికి పైగా మృతి!

Published Mon, Aug 1 2016 10:22 AM

చెత్త రోడ్లతో 10 వేల మందికి పైగా మృతి!

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లే కారణమౌతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ఉపరితల రవాణాశాఖ ఇటీవల వెల్లడించిన నివేదికలో.. 2015లో సంభవించిన రోడ్డు ప్రమాద మరణాల్లో 10,727 మంది కేవలం రోడ్లు సరిగా లేకపోవటం వల్ల మృతిచెందారని వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరంలో పోల్చితే ఈ మరణాల సంఖ్య కొంత తగ్గినట్లు నివేదిక చెబుతున్నా.. రోడ్లపై గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, నిర్మాణంలో ఉన్న రోడ్లతో పదివేల మందికి పైగా ప్రజలు మృత్యువాతపడటం కలవరపెడుతోంది.

రోడ్లపై గుంతల కారణంగానే 3,415 మంది మృతిచెందారని నివేదిక పేర్కొంది. ఈ తరహా మరణాలు మహారాష్ట్రలో ఎక్కువగా సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లపై గుంతల కారణంగా మరణించిన వారి సంఖ్య తక్కువగా రెండుగా నమోదైంది. అయితే.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రిపోర్ట్ కాకుండా ఉంటున్నాయని, ప్రమాదాలకు గల స్పష్టమైన కారణంపై సరైన విచారణ కూడ జరగటం లేదని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ విభాగం మాజీ అధికారి ఆశిష్ కుమార్ వెల్లడించారు.
 

Advertisement
Advertisement