బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో తెలంగాణకు చోటివ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో తెలంగాణకు చోటివ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో ఇప్పటివరకు సభ్యులుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), మహా రాష్ట్ర, ఏపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ప్రతినిధులున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణను అందులో చేర్చాలని కోరుతూ కేంద్రం ఈ పిటిషన్ వేసింది. ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్నందున ఏపీకి చోటు కల్పించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఇదివరకే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. అయితే తమకు కూడా స్థానం కొనసాగించాలని ఏపీ కోర్టును అభ్యర్థించింది. ఏపీ తరఫు న్యాయవాది హాజరు కాకపోవడంతో ధర్మాసనం కేసును వాయిదా వేసింది.