అది.. రాముడి జన్మస్థలమే!

Ayodhya birth place of Lord SRIRAM - Sakshi

ఆధారాలన్నీ అదే చెబుతున్నాయి

పురాణ కాలం నుంచీ వీటిని చూడొచ్చు

ఐదుగురిలో ఒక న్యాయమూర్తి అభిప్రాయమిది

న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రధానంగా దీన్ని మత విశ్వాసాలకు సంబంధించిన వ్యాజ్యంగా కాకుండా... స్థలానికి సంబంధించిన టైటిల్‌ వివాధంగానే భావించింది. తమ ముందున్న సాక్ష్యాధారాలను అనుసరించి తీర్పునిచ్చింది. వీరితో ఏకీభవిస్తూనే...ఈ ఐదుగురిలో ఒక న్యాయమూర్తి మాత్రం దీన్ని హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా కూడా పేర్కొన్నారు. మొత్తం 1045 పేజీల తీర్పులో ఈ రెండో అభిప్రాయాన్ని దాదాపు 116 పేజీల్లో వెలువరించారు. దీన్లో ప్రధానంగా ఆయన తన ముందున్న సాక్ష్యాధారాలను మూడు కాలాలకు చెందినవిగా విభజించారు. దాని ప్రకారం మొదటిది... పురాణ కాలం. రెండోది మసీదు నిర్మించిన క్రీ.శ. 1528 నుంచి 1858 మధ్యకాలంగా పేర్కొన్నారు.  

పురాణాల ప్రకారం శ్రీరాముడు కౌసల్యకు జన్మించారని రామాయణంలో చెప్పారు తప్ప ఎక్కడ జన్మించాడనేది చెప్పలేదని... కానీ రామాయణంతో దాదాపు సమానంగా భావించే రామ్‌చరిత్‌ మానస్‌ (1574)లో రాముడు ఈశాన్యంలో పుట్టాడనే అంశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్కంధ పురాణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దాంతో పాటు తాను విచారించిన సాక్షుల్లో సిక్కు చరిత్రపై అధ్యయనం చేసినవారు... క్రీ.శ.1510 సమయంలో గురునానక్‌ అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించినట్లు చెప్పారని గుర్తుచేశారు. వీటన్నిటినీ బట్టి 1528లో బాబ్రీ మసీదు నిర్మించక ముందే అక్కడ నిర్మాణం ఉందనేది ధ్రువపడుతోందని ఆయన పేర్కొన్నారు.  

‘‘పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనల క్రమాన్ని చూస్తే మనం ఒకటి స్పష్టంగా గుర్తించవచ్చు. శ్రీ రాముడి పుట్టిన స్థలం మసీదులోని మూడు డోమ్‌ల నిర్మాణానికి అడుగున ఉందనేది హిందువుల విశ్వాసం. జన్మస్థానం మీదనే మసీదును నిర్మించారనేది వారి నమ్మకం. ప్రహరీలోపలి మసీదు ఆవరణను రెండు భాగాలుగా విభజిస్తూ బిట్రీష్‌ కాలంలోనే గ్రిల్స్‌తో గోడ నిర్మించారు. గ్రిల్స్‌తో నిర్మించిన ఆ ఇనుప గోడ హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణంలోకి వెళ్లకుండా నిరోధించింది. బ్రిటిష్‌ వారి అనుమతితో అప్పటి నుంచే వెలుపలున్న రామ్‌ ఛబుత్రాలో పూజలు ఆరంభమయ్యాయి. ఆ ఛబుత్రా వద్ద ఆలయం నిర్మించుకోవటానికి అనుమతివ్వాలంటూ 1885లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి.  

అయితే ఇక్కడొకటి గమనించాలి. మసీదు ఆవరణను విభజించి, హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణానికి వెలుపల ఉంచినా... అది శ్రీరాముడి జన్మ స్థలమన్న వారి నమ్మకాన్ని మార్చుకోవాలని మాత్రం ఎవరూ చెప్పలేదు. శ్రీరాముడు ఆ అవరణలోనే జన్మించాడన్న విశ్వాసం వల్లే... దానికి సూచనగా అక్కడ ఛబుత్రాలో హిందువులు పూజలు చేస్తున్నారని భావించాలి. ముక్తాయింపు ఏమిటంటే... రాముడి జన్మస్థానంపైనే మసీదు నిర్మించారన్నది హిందువుల విశ్వాసం, నమ్మకం. పురాణకాలం నుంచి జరిగిన పరిణామాలు, ఆ తరవాతి కాలంలో దొరికిన మౌఖిక, లిఖితపూర్వక, చారిత్రక ఆధారాలు... ఇవన్నీ ఆ నమ్మకాన్ని ధ్రువపరుస్తున్నాయి’’అని తన తీర్పులో ఆయన పేర్కొన్నారు.

1850వ సంవత్సరం తరవాత లభ్యమైన ఆధారాలను ప్రస్తావిస్తూ...
► 1858లో అవధ్‌ థానేదార్‌ శీతల్‌ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్‌ జన్మస్థా న్‌ అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మసీదు మాత్రమే కాక జన్మస్థానం ఉందని ధ్రువపరిచారు. దీన్నొక ఆధారంగా భావించవచ్చు.  

► 1878లో ఫైజాబాద్‌ తాలూకా స్కెచ్‌ను నాటి అయోధ్య సెటిల్‌మెంట్‌ అధికారి కార్నెగీ రూపొందించారు. ఆ స్కెచ్‌లో ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదన్నారు. జన్మస్థాన్‌లో 1528లో బాబరు మసీదును నిర్మించినట్లు కార్నెగీ పేర్కొన్నారు.  
 

► 1877లో ప్రచురించిన మరో అవధ్‌ గెజిటీర్‌లో హిందూ – ముస్లిం విభేదాలను సవివరంగా ప్రస్తావించారు.  

► 1880లో ఎ.ఎఫ్‌.మిల్లిట్‌ ’ఫైజాబాద్‌ లాండ్‌ రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రిపోర్ట్‌’లో కూడా దీన్ని ప్రస్తావించారు.  

► 1889లో నార్త్‌వెస్ట్‌ అవధ్‌కు చెందిన అర్కియాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తన నివేదికలో జన్మస్థానంలో అద్భుతమైన పురాతన ఆలయం ఉండేదని, దాని స్థంభాలను ముస్లింలు తమ నిర్మాణంలో కూడా వాడారని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top