జల్లికట్టుదిట్టం..

awbi functioning of jallikattu in chennai - Sakshi

నిబంధనల రూపకల్పనలో ఏడబ్ల్యూబీఐ

త్వరలో విడుదల

నిర్వాహకులతో సంప్రదింపులు

చైర్మన్‌ గుప్తా కొత్త అడుగు

సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడంతో సాహస క్రీడ జల్లికట్టుకు ఇప్పటినుంచే దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులుదిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. 

అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈసారి మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రతా ఆంక్షల మధ్య సాగనుంది. ఆమేరకు అనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) కార్యాచరణ రూపొందిస్తోంది. ఏ ఒక్క ఎద్దు హింసకు గురికాకుండా. ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు నిబంధనల రూపకల్పన చేస్తోంది. అతి నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడలను నిర్వహించేందుకు ఏడబ్ల్యూబీఐ ఏర్పాట్లు చేస్తోంది. 

సాక్షి, చెన్నై: ‘ముత్యాల ముగ్గులు, రంగ వల్లులు, గొబ్బెమ్మలు.. బోగి మంటలు, పొంగళ్లతో ఇంటిల్లి పాది సంబరాలు’ ఇది సంక్రాంతి సందడి. అయితే,  తమిళనాట  ఈ సంబరాలకు తోడుగా వీరత్వాన్ని చాటే సాహస క్రీడ జల్లికట్టుకు పెద్ద పీట వేయడం ఆనవాయితీ.  రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తూ, తమ పౌరుషాన్ని చాటుకునే క్రీడాకారులతో ఈ క్రీడ సాగుతుంది. అయితే, ఈ సారి ఈ జల్లికట్టు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రత ఆంక్షల మధ్య సాగనుంది. ఇందుకు తగ్గ కార్యాచరణను అనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియ (ఏడబ్ల్యూబీఐ) రూపొందిస్తున్నది. 

రాష్ట్రంలో సాహస, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు పేరుగడించింది. ఈ క్రీడ ఎప్పటి నుంచి సాగుతోందో అన్నది ఓ ప్రశ్నగానే మిగిలింది. ఒకప్పుడు తమకు నచ్చిన వారిని వరుడుగా ఎంపిక చేసుకునేందుకు ఈ క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చేబుతోంది. అప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా సాగుతూ వస్తున్న ఈ క్రీడను  మంజు విరాట్, వడి మంజువిరాట్, వెల్లి విరాట్, వడం విరాట్‌ పేర్లతోనూ పిలుస్తుంటారు.  ‘‘సల్లి కాసు–కట్టు, సల్టికాసు కట్టుగా, సల్లికట్టుగా ...చివరకు జల్లికట్టుగా’ ఈ సాహస క్రీడ రూపాంతరం చెందినట్టుగా పురాణాలు చెబుతుంటాయి. తొలి నాళ్లల్లో యువతుల్ని మెప్పించేందుకు యువకులు  సాహసాన్ని ప్రదర్శిస్తే, రాను రాను ఇదో రాక్షసక్రీడగా మారిందని చెప్పవచ్చు. 

సంక్రాంతి సందర్భంగా కనుమనాడు ఆరంభం అయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలల పాటు వివిధ జిల్లాల వారీగా జరిగేది. ఒక్కో జిల్లాల్లో ఈ క్రీడ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు ఉన్నారు. తమ వీరత్వాన్ని చాటుకునేందుకు కదన రంగంలోకి దుకే వారు కొందరు అయితే, ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు దూసుకొచ్చే వారు మరి కొందరు. ఈ క్రమంలో కదన రంగంలోకి దిగే ఎద్దులను హింసించడం పెరిగింది. 

తప్పించుకునే క్రమంలో క్రీడా కారులపై తమ ప్రతాపాన్ని ఎద్దులు చూపించడం, వాటి దాటికి బలైన వారెందరో ఉన్నారు.  అలాగే, కదనరంగంలో దిగే బసవన్నలు రంకెలు వేసే విధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడం వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో జల్లికట్టుకు దూరంగా రెండేళ్లు గడపాల్సిన పరిస్థితి. కోర్టు స్టే విధించడంతో జల్లికట్టు ఇకలేనట్టే అన్న పరిస్థితి తప్పలేదు. ఎట్టకేలకు ఈ  ఏడాది ఆరంభంలో  దేశమే తమిళనాడు వైపుగా చూసే స్థాయిలో సాగిన ఉద్యమంతో మళ్లీ జల్లికట్టు తమిళుల సొంతం అయింది. 

జల్లికట్టు కట్టుదిట్టం:
గట్టి భద్రత నడుమ ఈ సారి జల్లికట్టును జరుపనున్నారు. అయినా, జల్లికట్టుకు నిషేధం లక్ష్యంగా పీట తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ సంక్రాంతి పర్వదినం వేళ సమీపిస్తుండడంతో ఇప్పటి నుంచే సాహస క్రీడ జల్లికట్టుకు దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి.  ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు.  ఇప్పటి నుంచి వాటికి మంచి ఆహారంతో పాటు, శిక్షణ మెళకువల్ని ఇస్తూ గెలుపు బావుటాకు వాటి యజమానులు సిద్ధం అవుంటే, రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులు దిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. 

అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈ సారి మరింత కట్టుదిట్టంగా నిబంధనల అమలు మీద ఏడబ్ల్యూబీఐ దృష్టి పెట్టింది. ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఆర్‌ గుప్తా ప్రధానంగా జల్లికట్టుకు కొత్త ఆంక్షలు, నిబంధనల రూపకల్పన మీద దృష్టి పెట్టారు. ఏ ఒక్క ఎద్దు హింసించ బడకుండా ఉండే రీతిలో, ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు తగ్గట్టుగా ఈ సారి నిబంధనల రూపకల్పన సాగనుంది.  

అతిపెద్ద మైదానం, భారీ భద్రతతో, సందర్శకుల భద్రత నిమిత్తం ప్రత్యేక గ్యాలరీలతో పాటుగా అన్ని రకాల నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడల్ని నిర్వహించే విధంగా ముందుకు సాగునున్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త నిబంధనలు నివేదిక రూపంలో చేరనుంది. ఆ తదుపరి నిర్వాహకులు, క్రీడాకారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యాచరణతో ఈ సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టును విజయవంతం చేయబోతున్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top