‘నీట్‌’ క్వాలిఫై అయితేనే విదేశాల్లో ఎంబీబీఎస్‌

Ashwini Kumar Choubey Says Qualify NEET To Study Medicine In Overseas - Sakshi

న్యూఢిల్లీ : విదేశాల్లో ఎంబీబీఎస్‌ తత్సమానమైన వైద్య విద్యా కోర్సుల్లో చేరదలచుకున్న అభ్యర్థులు కచ్చితంగా నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో(నీట్) అర్హత సాధించాలని ఆరోగ్య శాఖ సహాయం మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మంగళవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. అలాగే రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. గతంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే ప్రతి అభ్యర్థి ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉండేదన్నారు. 2018 మర్చిలో ఈ నిబంధనలను సవరించారని.. ప్రస్తుతం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే నీట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని వివరించారు.

నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌ పొందాల్సి అవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ప్రపంచంలోని 48 దేశాల్లో ఎంబీబీఎస్‌ లేదా తత్సమానమైన మెడికల్‌ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ అభ్యర్థులు 41,562 మంది ఉన్నట్టు వెల్లడించారు. చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్న వారి సంఖ్య 8,328గా ఉందన్నారు. భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఎంబీబీఎస్‌ చదువుతున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా, జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌ మొదటి పది స్థానాల్లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. విదేశాల్లో మెడిసిన్‌ చదవడానికి అనుమతి కోరుతూ 2019 జనవరి వరకు ఎంసీఐకి 4,558 దరఖాస్తులు అందయాని.. అందులో అత్యధికులు చైనాలో చదివేందుకే ఆసక్తి చూపారని పేర్కొన్నారు.

35 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ..
ఉజాలా పథకం కింద దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి గృహ వినియోగదారులకు 35 కోట్ల 16 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసినట్టు విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి కేకే సింగ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్‌ఈడీ బల్బులు నాణ్యతా నియంత్రణ ప్రమాణాలకు లోబడి ఉంటాయని చెప్పారు. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం ఎల్‌ఈడీ బల్బుల తయారీ విషయంలో ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉన్న తయారీదారులకు ఇప్పటివరకు 111 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను విక్రయించినట్టు పేర్కొన్నారు. ఉజాలా పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్‌ఈడీ బల్బుల్లో విఫలమవుతున్న వాటి  శాతం అతి తక్కువగా ఉన్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top