పీఓకేలో 16 ఉగ్రవాద ట్రైనింగ్‌ క్యాంపుల ఏర్పాటు

Army Sources Said Pakistan Activates 16 Terrorist Training Camps in PoK - Sakshi

న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే... పాకిస్తాన్‌ మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటికే భారత్‌ చేతిలో అనేకసార్లు దెబ్బ తిన్న పాక్‌.. తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత సైన్యాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడం, ప్రపంచ వేదిక మీద పాక్‌ను ఒంటరి చేయడం వంటి చర్యలు ఎన్ని తీసుకున్నప్పటికి దాయాది దేశంలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు మరింత తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇప్పటికే 16 ఉగ్రవాద ట్రైనింగ్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఒక సీనియర్‌ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘పీఓకేలో 16 టెర్రర్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. వేసవి ముగిసేలోపలే భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ క్యాంప్‌లకు చెందిన ఉగ్రవాదులు కొందరు ఎల్‌ఓసీ సమీపంలో పాడ్స్‌ను లాంచ్‌ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే వారి చర్యలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. ఏ మాత్రం అవకాశం చిక్కినా మరో సారి గట్టిగానే బుద్ధి చెప్తాం’ అన్నారు. జాకీర్‌ ముసాను చంపడం మూలానే ఇంత భారీ ఎత్తున ఉగ్ర చర్యలకు పాల్పడుతుండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం జైషే మహ్మద్‌ నాయకత్వం మొత్తం అంతరించి పోయిందని.. ఉన్న వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని అధికారులు తెలిపారు. భారత సైన్యం, ఇతర బలగాలు చేస్తున్న దాడులకు జడిసి.. కొత్త వారు ఎవరూ ఇలాంటి ట్రైనింగ్‌ క్యాంప్‌ల్లో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top