క‌రోనా నుంచి భార‌త్ బయ‌ట‌ప‌డుతుంది: రావ‌త్‌

Army Navy and Air force Have Moved Into Action Said By Bipin Rawat - Sakshi

సాక్షి, ఢిల్లీ: లాక్‌డౌన్‌, సామాజిక‌దూరం పాటిస్తూ ఏప్రిల్‌14 క‌ల్లా భార‌త్ కోవిడ్‌-19 చైన్‌ను బ్రేక్ చేస్తుంద‌ని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. లేదంటే దాని త‌ర్వాత ఎదుర‌య్యే ప‌రిణామాల‌కు సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. ప్రజ‌ల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌భుత్వం చేపట్టే చర్యలకు అనుగుణంగా ప‌నిచేయ‌డానికి మిలిట‌రీ సంసిద్ధంగా ఉంద‌ని జాతీయ మీడియా నిర్వ‌హించిన ఓ ఫోన్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఆర్మీ, నేవీ, వైమానిక ద‌ళాలు క‌రోనాపై పోరాటంలోభాగ‌స్వామ్యం అయ్యాయ‌ని చెప్పారు. ఈశాన్య భార‌తంలో క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా లేక‌పోయినా నాగాలాండ్‌లోని డిమాపూర్, జఖామా వంటి దూర ప్రాంతాలలో కూడా ఇప్ప‌టికే ఆసుప‌త్రులు సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు.

వ్యాధి నియంత్ర‌ణ‌కు ప్ర‌తీ జోన్‌లో రెండు నుంచి మూడు ఆసుప‌త్రులు ఉన్న‌ట్లు చెప్పారు. ప‌రిస్థితుల‌పై అంచ‌నా వేసేందుకు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రితో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని అన్నారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పీకె మిశ్రా, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాల‌తో స‌మావేశాల‌కు హాజ‌రవుతున్న‌మని బిపిన్ రావ‌త్ వెల్ల‌డించారు. ప్ర‌తీ వార్డులో నిత్యం ర‌ద్దీగా ఉండే ఢిల్లీలోనూ కోవిడ్‌-19 రోగుల కోసం ప్రత్యేక ఆసుప‌త్రులు సిద్ధం చేశామ‌ని తెలిపారు. జైసల్మెర్, జోద్‌పూర్‌లోలో 500 కోవిడ్ రోగుల‌కు ఐసోలేష‌న్‌, క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని అన్నారు.

“ఒక‌వేళ భార‌త్‌లో క‌రోనా బాధితుల సంఖ్య అధిక‌మైతే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఢిల్లీలో 3 ఆర్మీ ప‌బ్లిక్ స్కూళ్లు, నేవీ, వైమానిక పాఠ‌శాలలు ఒక్కోటి ఉన్నాయి. ఈ స్కూళ్ల‌ను క్వారంటైన్ సెంట‌ర్లుగా మారుస్తాం. ఇందులో దాదాపు 1500 మంది ఉండే సామ‌ర్థ్యం ఉన్నా ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్ట్యా కేవ‌లం 200 మందినే త‌ర‌లిస్తాం. అవ‌స‌ర‌మైతే అన్ని ప్రాంతాల్లో ఇదే మోడ‌ల్‌ను అనుస‌రిస్తాం. 370 వెంటిలేటర్లు, మాస్కులు, ర‌క్ష‌ణ సూట్లు వంటి వైద్య ప‌రిక‌రాల త‌యారీకి ఇప్ప‌టికే డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య ప‌రికరాల‌కు కొర‌త రాకుండా చూస్తాం. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో పొరుగు దేశాలకు సహాయం చేయడానికి రెండు నావికాదళ వైద్య నౌకలు సిద్ధంగా ఉన్నాయి. లాక్‌డౌన్, సోష‌ల్ డిస్టెన్సింగ్‌, వాతావ‌ర‌ణ పరిస్థితుల దృష్ట్యా మ‌న‌దేశం క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది” ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top