
అసలే పేద... ఆపై కొత్త బాధ..!
అతనిది అందరిలాంటి జీవితం కాదు. పుట్టుకతోనే నాలుగు కాళ్లతో పుట్టాడు. ఆపై బీదరికం.
ఉత్తరప్రదేశ్ : అతనిది అందరిలాంటి జీవితం కాదు. పుట్టుకతోనే నాలుగు కాళ్లతో పుట్టాడు. ఆపై బీదరికం. ఈ రెండు సవాళ్లను అధిగమించడానికి ఆ యువకుడు పడని కష్టాలు లేవు.తన అదనపు రెండు కాళ్లను తీసేయమని డాక్టర్లను వేడుకోవడం ఒకటైతే.. పుట్టుకతో వచ్చిన దారిద్య్రానికి ఎవరైనా చేయూతనిచ్చి ఆపరేషన్ కు సాయం చేయాలని దీనంగా అర్థిస్తున్నాడు. ‘అందరిలాగే సాధారణ జీవితం గడపాలని నాకూ ఉంది. దీనికి అదనంగా ఉన్న రెండు కాళ్లూ అడ్డం పడుతున్నాయి. ఆ భారాన్ని మోయడం నా వల్ల కాదు. దయచేసి వాటిని తీసేయండి’ ఇదీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ సోషల్‌మీడియా ద్వారా చేసిన వినతి.
రెండు కాళ్లకు అదనంగా అతడి వెనుక భాగంలో నడుము కింద మరో రెండు వేలాడుతూ ఉంటాయి. అవి అతడికి చాలా ఇబ్బందిగా పరిణమించాయి. వాటిని అరుణ్ కదపలేడు. నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. అరుణ్ పుట్టినపుడు నాలుగు కాళ్లూ ఒకే సైజులో ఉన్నాయని అతడి తల్లి కోకిలాదేవి చెప్పారు. ఈ శస్త్రచికిత్స కోసం చాలా ఆస్పత్రులకు తిరిగామన్నారు.చిన్న వయసులో ఆపరేషన్ మంచిది కాదని డాక్టర్లు చెప్పారన్నారు. కుమారుడి పరిస్థితి తమకు చాలా ఆవేద న కలిగించిందని తండ్రి రామ్‌సింగ్ అంటున్నాడు. అరుణ్ వినతికి ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. డాక్టర్ హెర్మంత్ శర్మ నేతృత్వంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు చేసింది. అతడికి రెండో పెల్విన్ (వెన్నెముక కింది భాగంలో ఉండే కటి) కూడా ఉన్నట్లు గుర్తించారు. ‘అదనంగా ఉన్న కాళ్లకు రక్త సరఫరా ఎలా జరుగుతుంది? వాటి నిర్మాణం ఎలా ఉంది? అనేది పరిశీలించాల్సి ఉంది’ అని డాక్టర్ శర ్మ తెలిపారు. ఆ తర్వాతే శస్త్రచికిత్సపై చెప్పగలమన్నారు.