బిహార్‌లో అధికార జేడీయూకు మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల మీద సీబీఐ
తేజస్వీ యాదవ్‌ను డిమాండ్ చేసిన జేడీయూ
పట్నా: బిహార్‌లో అధికార జేడీయూకు మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల మీద సీబీఐ అవినీతి కేసులు నమోదు చేయడంపై జేడీయూ నేతలు తొలిసారిగా పెదవి విప్పారు. లాలూ కొడుకు, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రజలకు నిజాలు చెప్పాలనీ, కేసులపై వివరణ ఇవ్వాలని జేడీయూ మంగళవారం డిమాండ్ చేసింది. తేజస్వి నుంచి రాజీనామాను కోరకపోయినా, దాదాపు అదే స్థాయిలో జేడీయూ స్పందించింది. ముఖ్యమంత్రి నితీశ్ అధ్యక్షతన మంగళవారం జేడీయూ కీలక నేతల సమావేశం జరిగింది.
2006నాటి ‘హోటళ్లకు భూములు’ కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కొడుకు తేజస్వీ, ఇతర కుంటుంబ సభ్యులపై సీబీఐ కేసులు నమోదు చేయడం తెలిసిందే. అవినీతి కేసులు ఉన్నందున తేజస్వీ యాదవ్ పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ, కొందరు జేడీయూ నేతలు కోరుతున్నారు. అటు ఆర్జేడీ మాత్రం ఆయన రాజీనామా చేయబోరని సోమవారమే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జేడీయూ మంగళవారం భేటీ అయ్యింది.
సమావేశం అనంతరం జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని ఎలా పాటించాలో మా పార్టీకి తెలుసు. రాజకీయ త్యాగాలు చేసిన, సవాళ్లను ఎదుర్కొన్న రికార్డు మా పార్టీకి ఉంది. ఇప్పుడు బంతి ఆర్జేడీ కోర్టులో ఉంది. ఆరోపణలపై మీ వివరణ ఏంటో ప్రజలకు చెప్పండి’ అని అన్నారు. మరో నేత రామై రామ్ మాట్లాడుతూ నిజాలు చెప్పడానికి ఆర్జేడీకి నాలుగు రోజుల సమయం ఇచ్చామనీ, అనంతరం మరోసారి తేజస్వీ రాజీనామాపై చర్చిస్తామని తెలిపారు. భేటీలో ముఖ్యమంత్రి నితీశ్ మాట్లాడుతూ ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రభుత్వం తన విధులను నిర్వర్తిస్తుంది’ అని అన్నారని ఓ ఎమ్మెల్సీ చెప్పారు. అయితే సమావేశం గురించి నితీశ్ మాత్రం విలేకరులతో మాట్లాడలేదు.