నేషనలిజానికి అర్థం నాకు తెలుసు

Vishwaroopam 2 will be much bigger than the first part - Sakshi

‘‘విశ్వరూపం’ సినిమా ఫస్ట్‌ పార్ట్, సెకండ్‌ పార్ట్‌ సినిమాలకు వచ్చిన గ్యాప్‌ మా వల్ల కాదు. అది రాజకీయం. ఇప్పుడు అవన్నీ పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా ఆడియన్స్‌ దగ్గరకు వస్తోంది. ఇంతకు ముందు సినిమాను మర్చిపోతారేమో అనే భయం ఉండేది. డిజిటల్‌ యుగం వల్ల ఫస్ట్‌ పార్ట్‌ పోయిన సంవత్సరం రిలీజ్‌ అయిన సినిమాలానే గుర్తుపెట్టుకొని సీక్వెల్‌ను స్వాగతిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని కమల్‌హాసన్‌ అన్నారు. కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో రిలీజ్‌ అయిన ‘విశ్వరూపం’ చిత్రానికి సెకండ్‌ పార్ట్‌. ఆండ్రియా, పూజా కుమార్‌ హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. జిబ్రాన్‌ సంగీత దర్శకుడు.  ఈ నెల 10న సినిమా రిలీజ్‌ అవుతున్న  సందర్భంగా కమల్‌హాసన్‌ చెప్పిన విశేషాలు.

సినిమాను ముందుగానే రెండు పార్ట్స్‌గా డిజైన్‌ చేశాం. ఈ సినిమా షూటింగ్‌ నాలుగేళ్ల క్రితం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ లాస్ట్‌ ఇయర్‌ స్టార్ట్‌ అయ్యాయి. కొత్తగా ఏమీ షూటింగ్‌ చేయలేదు. చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌ చేశాం. సెకండ్‌ పార్ట్‌ ఇండియాలో జరుగుతుంది. ఈ ఇండికేషన్‌ ఫస్ట్‌ పార్ట్‌ లాస్ట్‌లో చూపించాం. ఫస్ట్‌ పార్ట్‌ అంతా అమెరికాలో జరిగింది. సినిమాలో హీరోకి  వసీమ్‌ అహ్మద్‌ కశ్మీరీ అనే పేరు ఎందుకు పెట్టాం? అనేది కూడా ఇందులో వివరిస్తాం. సెకండ్‌ పార్ట్‌ చూసేటప్పుడు సినిమాలోని అన్ని లేయర్స్‌ అర్థం అవుతాయి.

ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు
క్రియేటీవ్‌ ఫ్రీడమ్‌ అనేది మన దగ్గర చాలా తక్కువ అని ఫీల్‌ అవుతాను. వాక్‌ స్వాతంత్య్రం కూడా తక్కువే. సినిమా అనేది నాకు దొరికిన ఒక ప్లాట్‌ఫామ్‌. వివాదాలు చేసేవాళ్లు ఆ పనిని ఆపేశారు. ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడినే. ఇప్పుడు ఎవరూ ఎవరి ఉద్దేశాలు వినేలా లేరు. నేషనలిజానికి అర్థం మారుతూ ఉంటుంది. పెషావర్‌ మనది. కానీ ఇప్పుడు కాదే. నిజాం అని పిలిచే వాళ్లం. కానీ ఇప్పుడు? ఎవరి ఒపీనియన్‌ వాళ్లది. నేషనలిజానికి నా అర్థం ఏంటో నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు. మా స్టైల్‌లో మేం పాటిస్తూనే ఉన్నాం. ఎవరి అర్థం వారు డిఫైన్‌ చేసుకోవచ్చు.

ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నాం
‘విశ్వరూపం 2’ యాక్షన్‌ సీన్స్‌ ఫస్ట్‌ పార్ట్స్‌ని మించి ఉంటాయి అనుకుంటున్నాను. నాతోటి హీరోలు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. పది సంవత్సరాల క్రితం చేసిన యాక్షన్స్‌ సినిమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్‌ ఇంకా పెరిగాయి. వరల్డ్‌ సినిమా స్టాండర్డ్స్‌లో మనం సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా కూడా ఆ స్థాయికి తక్కువ ఏం ఉండదనుకుంటున్నాను. జిబ్రాన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఫస్ట్‌ పార్ట్‌కి పని చేసిన శంకర్‌ ఎహసన్‌ లాయ్‌ని రిపీట్‌ చేయడం కుదర్లేదు.

సినిమాలు వేరు.. పాలిటిక్స్‌ వేరు
సినిమాలు వేరు. పాలిటిక్స్‌ వేరు. సినిమాల్లానే నా పొలిటికల్‌ ఐడియాలజీలు కూడా సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయా అంటే.. అందరూ ప్రజాస్వామ్యానికి అలవాటు పడాలి, అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మనకు స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది. కానీ నేను మాత్రం 1948లోనే  ఉన్నాం అని భావిస్తాను. స్వాతంత్య్రం వచ్చి ఒక్క ఏడాదే అయిందని భావించి, అభివృద్ధికి అందరూ తమ వంతు సహకారం అందించాలి.

కమల్‌ పేరు వినిపించదు!
చాలా మంది మంచి యాక్టర్స్‌ ఉన్నారు.  ఇంత మంది జనాభా ఉన్నాం. మంచి నటులు వస్తారు, రావాలి. నేను చాలా స్వార్థపరుణ్ణి. మంచి మంచి పాత్రలన్నీ నేనే ఎంచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి. అయితే రాజకీయాల్లోకి వెళ్లాను కాబట్టి వేరే వాళ్లు చెబుతారు.  కమల్‌హాసన్‌ అనే పేరు వినిపించదు. అంతే కానీ అదే టాలెంట్‌తో, ఇంకా ఎక్కువ టాలెంట్‌తో వస్తూనే ఉంటారు. ‘సాగర సంగమం’లో ‘ఆర్ట్‌ నెవర్‌ ఎండ్స్‌’ అని వేశాం.

సినిమాలపై పొలిటికల్‌ ప్రెజర్‌
సినిమాలపై వచ్చే పొలిటికల్‌ ప్రెజర్‌ అసలు పొలిటికల్‌ ప్రెజరే కాదు. జస్ట్‌ ప్రెజర్‌ మాత్రమే. పొలిటికల్‌ అని అంటున్నాం. నిరంకుశత్వ ధోరణి ఉన్నవాళ్లే ఎక్కువ భయపడతారని నేను భావిస్తాను. ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అయినా, వేరే ఏ జర్నలిస్ట్‌ అయినా టైమ్‌ వచ్చినప్పుడు పొలిటీషియన్స్‌ను ప్రశ్నలు అడగాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత ఉంది జర్నలిస్ట్‌లకు. వాళ్లు సమాధానాలను దాటేయవచ్చు కానీ జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్‌ వేయకుండా ఉండకూడదు. ఇలా జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్‌ అడిగినప్పుడు పొలిటీషియన్‌గా నా పని ఈజీ అవుతుంది.  

బాలచందర్‌గారు స్టార్స్‌ని తయారు చేశారు
యాక్టర్స్‌ని సెలెక్ట్‌ చేయడం రెండు విధాలు. ఒకటి స్టార్‌ దగ్గరకు వెళ్లడం, స్టార్స్‌ని తయారు చేయడం. బాలచందర్‌ గారు స్టార్స్‌ని తయారు చేయడం చూశాను. మట్టి బొమ్మలకు దేవత రూపాలు ఇచ్చారు. మేల్‌ స్టార్స్, ఫీమేల్‌ స్టార్స్‌ని తయారు చేశారు. ఆ పద్ధతి నాకు ఇష్టం. ఆర్ట్‌ని ప్రేమిస్తే తప్ప అలా చేయలేం. స్టార్స్‌ అంటే సెపరేట్‌ వ్యాన్, టచప్‌ చేయడం ఇవన్నీ కాదు. ఎప్పుడు రిహార్సల్స్‌కి పిలిచినా వచ్చేవారు. పట్టుదలతో చేసేవారే స్టార్స్‌. మా టీమ్‌ అందరం కలిసి స్క్రిప్ట్‌ చదువుతాం. ఏమైనా డౌట్స్‌ ఉంటే వాళ్లు నన్ను అడుగుతారు. ఈ సినిమా కెమెరామెన్‌ ఒక డైరెక్టర్, ఎడిటర్‌ ఒక డైరెక్టర్‌.. ఇలా ఎంతో మంది ఇంటెలిజెన్స్‌ పర్సన్స్‌ వేసే ఇంటెలిజెన్స్‌ క్వశ్చన్స్, వచ్చే డిస్కషన్స్‌ సినిమాకు ప్లస్‌ అవ్వడంతో పాటు నా క్యారెక్టర్‌ మరింత మెరుగు అవ్వడానికి  దోహదపడుతుంది. మా టీమ్‌లో ఎక్కువ మంది డైరెక్టర్స్‌ ఉన్నారు. ఒక సినిమాను తీయడంలో ఉన్న కష్టం ఏంటో వారందరికీ తెలుసు.

వాళ్ల రుణం తీర్చుకోవాలి
ఫిల్మ్‌  మేకింగ్‌లో ప్రతీ పనిని ఎంజాయ్‌ చేస్తాను. నేను స్టార్ట్‌ చేసిన ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ అయిన తర్వాత  ఆడియన్స్‌తో కలిసి చూడటమే నా రెమ్యునరేషన్, ఫస్ట్‌ అడ్వాన్స్‌లా భావిస్తాను.  నా ఫేమ్, మనీ, నా స్టేటస్‌ అన్నీ ఆడియన్స్‌ ఇచ్చినవే. వాళ్ల రుణం తీర్చుకోవాలి కదా. వాళ్లకు తిరిగి  ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను (రాజ కీయాల్లోకి అడుగుపెట్టడాన్ని ఉద్దేశించి).

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top