మహేశ్‌ సినిమాలో నటిస్తున్నా: విజయశాంతి | Vijayashanti Comeback With Mahesh Babu Movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సినిమాలో నటిస్తున్నా: విజయశాంతి

May 31 2019 8:04 PM | Updated on May 31 2019 8:05 PM

Vijayashanti Comeback With Mahesh Babu Movie - Sakshi

రీఎంట్రీలో మొదటి సినిమా మహేశ్‌బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని విజయశాంతి పేర్కొన్నారు.

హైదరాబాద్‌: సీనియర్‌ నటి విజయశాంతి మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఆమె ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి పునఃప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ప్రిన్స్‌’  మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం. సూపర్‌స్టార్‌ కృష్ణకు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయశాంతి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘సూపర్‌స్టార్‌ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగులో నా మొదటి సినిమా కృష్ణతో నటించిన ‘ఖిలాడీ’.. ఆ తర్వాత 150 సినిమాలు చేశాను. రాజకీయాల్లోకి వెళ్లడంతో 13 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను. తొలి సినిమా కృష్ణతో నటిస్తే.. నా రీఎంట్రీలో మొదటి సినిమా ఆయన కుమారుడు మహేశ్‌బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద’ని విజయశాంతి పేర్కొన్నారు.

అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement