ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది

Vijay Deverakonda Speech At Meeku Maathrame Cheptha - Sakshi

‘‘కొత్త సినిమాకి నిర్మాత దొరక్కపోతే ఎంత కష్టం అనేది ‘పెళ్ళి చూపులు’ టైమ్‌లో చూశా. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే.. ఇప్పుడు నేను ఉన్న ఈ స్టేజ్‌లో ఎవరికైనా సపోర్ట్‌ చేయొచ్చని ‘మీకు మాత్రమే చెప్తా‘ సినిమా నిర్మించా’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. తరుణ్‌ భాస్కర్, వాణీ భోజన్, అభినవ్‌ గోమటం ప్రధాన పాత్రల్లో షామీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ చెప్పిన విశేషాలు.

► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీరు హీరోగా ఎందుకు నటించలేదు?
నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా చేసిన తర్వాత షామీర్‌ సుల్తాన్, ‘మీకు మాత్రమే చెబుతా’ కో– డైరెక్టర్‌ అర్జున్‌ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్‌ ఫిల్మ్స్‌ చూశాను. ఏ మాత్రం బడ్జెట్‌ లేకున్నా చాలా రిచ్‌గా తీశారు. వాళ్ల ప్రతిభ చూసి ఓ సినిమా చేస్తానని చెప్పా. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదల కాకముందు ‘మీకు మాత్రమే చెప్తా’ కథ చెప్పారు. నేను కూడా చేద్దామనుకున్నాను. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదల తర్వాత నేనీ సినిమా చేయడం కరెక్ట్‌ కాదనిపించింది. వేరే నిర్మాతల కోసం తిరుగుతున్నాం కానీ వర్కవుట్‌ కాలేదని ఆ ఇద్దరూ అన్నారు. కథపై, వారిపై ఉన్న నమ్మకంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా.

► మీ ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్‌ భాస్కర్‌నే ఈ సినిమాకిæహీరోగా పెట్టుకోవడానికి కారణం?
ఈ చిత్రంలోని రాకేశ్‌ పాత్రకి నవీన్‌ పొలిశెట్టి, తరుణ్‌ భాస్కర్‌ సరిపోతారనిపించింది. ‘పెళ్ళిచూ పులు’ సినిమా చేస్తున్నప్పుడు ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తరుణ్‌ చేసి చూపించేవాడు. ఆ సమయంలో నిజంగా మాకంటే బాగా నటించేవాడు. అందుకే తరుణ్‌ని లీడ్‌ రోల్‌ చేయమని అడిగాను. ఏదో చిన్న చిన్న రోల్స్‌ చేస్తున్నానే కానీ లీడ్‌ రోల్‌ కష్టం, నా దృష్టి డైరెక్షన్‌పైనే అన్నాడు. ఓ సారి కథ వినమని చెప్పా. విన్నాక ఒప్పుకున్నాడు.

► ఈ సినిమా కథలో మీరు కల్పించుకున్నారా ?
స్క్రిప్ట్‌ ఫైనలైజ్‌ చేశాక ఎక్కడా కల్పించుకోలేదు. సెట్‌కి ఒక్కసారి మాత్రమే వెళ్లాను. అది కూడా ఓ సారి వస్తే బాగుంటుంది అని వారు అడిగితేనే వెళ్లా. సంగీతం గురించి మాత్రమే నాతో చర్చించేవాళ్లు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ అప్పుడు కూడా కొంచెం చూశా. మిగిలినవాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. అల్లు అరవింద్‌గారి వంటి నిర్మాత కూడా సెట్స్‌లో మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. మా యూనిట్‌కి నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చా.  

► నిర్మాణం రిస్క్‌ అనుకోలేదా?
నేనిప్పటివరకూ చేసిన కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ‘మీకు మాత్రమే చెప్తా’కి పెట్టాను. ‘ఇప్పుడు మనకెందుకురా ప్రొడక్షన్‌’ అని మా నాన్న (వర్థన్‌) అన్నారు. అయితే కథ బాగుంది.. ఈ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉంది. పైగా డబ్బులు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చనే నమ్మకంతో రిస్క్‌ తీసుకుని ఈ సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ  ఓ చిన్న ఇంట్లో నెలకు రూ. 3000 అద్దె కట్టుకుంటూ, తర్వాతి నెల ఎలా? అంటూ ఇబ్బందులు పడేవాణ్ణి.

► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీకు నచ్చిందేంటి?
ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా మా సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తే నాకు తృప్తి. ఈ రోజుల్లో వినోదం వర్కౌట్‌ అవుతుంది. సినిమా చూశాక బాగా చేశారు, బాగా ఎంజాయ్‌ చేశాం అని ప్రేక్షకులు భావిస్తారు.  

► కొత్తవాళ్లతో ఇంకా సినిమాలు నిర్మిస్తుంటారా?
ముందు ముందు కూడా చేయాలని ఉంది. మా సినిమాని సునీల్‌ నారంగ్‌గారు అడ్వాన్స్‌ ఇచ్చి కొన్నప్పుడు మా నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. శాటిలైట్‌ రైట్స్, మ్యూజిక్‌ రైట్స్‌.. ఇవన్నీ జరిగిన తీరు చూస్తుంటే ఇంకో సినిమా చేయడానికి ఇప్పుడు ధైర్యం వచ్చింది.

► మీరు హీరోగా చేస్తున్న సినిమాల గురించి...
క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో చేస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఎనిమిది రోజులు షూటింగ్‌ మిగిలి ఉంది. పూరి జగన్నాథ్‌గారితో చేయబోయే ‘ఫైటర్‌’ జనవరిలో ప్రారంభమవుతుంది. ఆనంద్‌ అన్నామళై దర్శకత్వంలో చేస్తోన్న ‘హీరో’ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top