నటి అంజలీదేవి అస్తమయం

నటి అంజలీదేవి అస్తమయం - Sakshi


అనారోగ్యంతో కన్నుమూసిన వెండితెర సీతమ్మ

16న చెన్నైలో అంత్యక్రియలు

500కు పైగా చిత్రాల్లో అలరించిన మన ‘పల్లెటూరి పిల్ల’




సాక్షి, చెన్నై/ హైదరాబాద్: అలనాటి మేటి నటి, వెండితెర సీత అంజలీ దేవి (86) ఇక లేరు. అనారోగ్యంతో సోమవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. చెన్నై అడయార్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న అంజలీ దేవి కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్యం కారణంగా శరీరం చికిత్సకు సహకరించక పోవడంతో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్రీరామచంద్ర ఆసుపత్రికి ఆమె అవయవాల దానం చేశారు. అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరగనున్నాయి.






అంజలీ దేవి భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు సుమారు దశాబ్దం క్రితమే మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు. అంజలీ దేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో విషాదఛాయలు అలముకున్నారుు. అంజలీ దేవి అసలు పేరు అంజనీ కుమారి. 1928 అక్టోబర్ 24న జన్మించారు. మృదంగ విద్వాంసుడు కాళ్ల నూకయ్య, సత్యవతి దంపతుల పెంపుడు కుమార్తె. బాల్యం కాకినాడలో గడిపిన ఆమె పన్నెండేళ్ల వయసులో రంగస్థల ప్రవేశం చేశారు. రామ్ రహీమ్, తెలుగుతల్లి, మోడ్రన్ ఇండియా వంటి పలు సాంఘిక నాటకాల్లో నటించారు. 13 ఏళ్ల వయస్సులోఆదినారాయణరావును వివాహమాడారు.

 

 ప్రముఖుల సంతాపం: అంజలీ దేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డి.కె.అరుణ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. అంజలీ దేవి వంటి కళాకారులు అరుదుగా పుడతారని, ఆమె మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు తీరని లోటని రోశయ్య పేర్కొన్నారు. అంజలీ దేవి మరణంతో తెలుగు చలనచిత్ర రంగం తొలి తరానికి చెందిన ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్లయిందని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

 కళామతల్లి సేవలో...

 

 1955లో తన సొంత చిత్రం అనార్కలి చిత్ర నిర్మాతగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత వరుసగా సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులను స్వీకరించారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. 2005లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, 2008లో ఏఎన్నార్ జాతీయ అవార్డు అంజలీదేవిని వరించాయి. అంజలి పిక్చర్స్‌ను నెలకొల్పిన ఆదినారాయణరావు దంపతులు అనార్కలి, భక్త తుకారాం వంటి పలు కళాఖండాలను నిర్మించారు. ప్రఖ్యాత నటుడు చిత్తూరు నాగయ్య అంటే అంజలీ దేవి ఎనలేని అభిమానం కనబరిచేవారు. చిత్తూరు నాగయ్య స్మారక ట్రస్టును నెలకొల్పి ప్రతి ఏటా ఉత్తమ కళాకారులకు అవార్డులను అందిస్తూ వచ్చారు. పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. చెన్నైలో తాను నివసిస్తున్న ఇంటిలో సగ భాగాన్ని ‘సుందరం’ పేరుతో బాబామందిరంగా మార్చారు.

 

 గొల్లభామతో సినీరంగ ప్రవేశం

 

 మద్రాసు వెళ్లి గొల్లభామ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన అంజలీ దేవి ఇందులో ప్రతి నారుుక పాత్ర పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన బాలరాజు, కీలుగుర్రం చిత్రాల్లోనూ ప్రతి నారుుక పాత్రల్లోనే నటించారు. అరుుతే తదనంతర కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల సరసన అనేక చిత్రాల్లో ఆమె హీరోరుున్‌గా రాణించడం విశేషం. ఎన్టీఆర్ నటించిన పల్లెటూరి పిల్ల చిత్రం ద్వారా తొలిసారి కథానాయికగా పరిచయమైన అంజలీ దేవి ఇక వెనుతిరిగి చూడలేదు.



తెలుగుతో పాటు తమిళ , కన్నడ, హిందీ భాషల్లో 500కు పైగా సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించారు. తెలుగు సినీ జగత్తులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి మేటి నటులతో పాటు తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి నట దిగ్గజాలతోనూ కలసి నటించారు. పరదేశి, అనార్కలి, సువర్ణసుందరి, పాండురంగ మహత్మ్యం, చెంచులక్ష్మి, జయభేరి, జయసింహ, జయం మనదే, పల్నాటి యుద్ధం, భక్త ప్రహ్లాద వంటి ఆణిముత్యాలు ఆమె నటనా కౌశల్యానికి కొన్ని ఉదాహరణలు. ఇక లవకుశ సిని మాలో సీతగా నటించిన అంజలీ దేవి అఖిలాంధ్ర ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. సీత అంటేనే అంజలీదేవి గుర్తుకు వచ్చేంతగా అభిమానులను మైమరపింపజేశారు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top