బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా

Tollywood: Flop Movies In 2019 - Sakshi

రౌండప్‌- 2019

సినిమాకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు నేటితరం నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు అంతే భారీమొత్తంలో నష్టాలను తీసుకుచ్చి నిర్మాతలకు ఊహకందని విధంగా చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఈ ఏడాది కొంతమంది హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. ఎంత ప్రచారం చేసినా, ఎంత హైప్‌ క్రియేట్‌ చేసినా ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించడంలో కొన్ని చిత్రాలు ఘోరంగా ఫెయిల్‌ అయ్యాయి. అవేంటో చూద్దాం..


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్‌ భారీ అంచనాలతో విడుదలైంది. దీనికోసం విపరీతమైన పబ్లిసిటీ కూడా చేశారు. కానీ విడుదలైన తొలినాడే ఈ సినిమా తేలిపోయింది. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇక థియేటర్‌ దాకా వెళ్లిన ప్రేక్షకులకు అనవసరంగా వచ్చాం అన్న ఫీలింగ్‌ రాకమానదు. వెరసి ఈ సినిమా ఒక పాత చింతకాయ పచ్చడి. కలెక్షన్లు బాగున్నా ఫ్లాఫ్‌తో 2019కు బాలయ్య గుడ్‌బై చెప్పక తప్పలేదు.


17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు ఎంత సూపర్‌ హిట్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సినిమాకు సీక్వెల్‌ కాకపోయినప్పటికీ అదే టైటిల్‌తో మన్మథుడు2 ద్వారా అభిమానులను పలకరించాడు. ఇప్పటికీ తను గ్రీకువీరుడినే అంటూ వచ్చిన మన్మథుడు 2 అట్టర్‌ ఫ్లాఫ్‌గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. ఆయన కెరీర్‌లోనే పెద్ద ఫ్లాఫ్‌గా నిలిచిపోయింది.


గతేడాది రంగస్థలం సినిమాతో టాలీవుడ్‌ను షేక్‌ చేసిన మెగా హీరో రామ్‌చరణ్‌ ఈ ఏడాది మాత్రం ఘోర ఓటమిని చవిచూశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. బలహీనమైన కథకు బోలెడు ఫైట్‌ సీన్లు జోడించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు.


కొత్త దర్శకుడు భరత్‌ కమ్మ రౌడీతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంచనాలు ఘనం, ఫలితం శూన్యం అన్న మాదిరిగా తయారైంది ఈ సినిమా పరిస్థితి. వరుసగా అపజయాలను చవిచూస్తున్న విజయ్‌ దేవరకొండకు ఈ సినిమా ఆశాదీపంగా కనిపించినా చివరికి నిరాశనే మిగిల్చింది.


ఆర్‌ఎక్స్‌100 సినిమాతో టాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకున్న హీరో కార్తికేయ. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను వచ్చినంటూ ముందూ వెనకా చూసుకోకుండా చేసుకుంటూ పోయాడు. అదే అతనికి పెద్ద మైనస్‌గా మారింది. గుణ 369 దారుణంగా దెబ్బ తీసినా 90ఎమ్‌ఎల్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.


ఈ ఏడాది హారర్‌ చిత్రాలు ఏమంత మెప్పించలేకపోయాయి. సుధీర్‌బాబు, నందిత కలిసి నటించిన కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ప్రేమకథా చిత్రం’ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో సప్తగిరి కామెడీతో చెలరేగిపోయాడు. ఈ చిన్న సినిమా అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. దీంతో హీరో సుమంత్‌ దానికి సీక్వెల్‌ ట్రై చేశాడు. కానీ రోత పుట్టించే కామెడీతో, నాసిరకమైన కథతో ప్రేక్షకులను నిరాశపరిచింది.


విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్‌ తర్వాత హీరోగానూ రాణించాడు. కానీ ఆయనకు హిట్‌ రావడమే గగనమైపోయింది. తాజాగా ఆయన నటించిన 26వ చిత్రం ‘చాణక్య’ కూడా బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. పాత కథను తిప్పి తిప్పి చూపించడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. గోపీచంద్‌ మాత్రమే ఫుల్‌ ఎఫర్ట్‌ పెట్టినట్టు కనిపించింది. మిగతావాళ్లందరూ పేలవ ప్రదర్శన కనబర్చారు. కనీసం పాటలు కూడా బాగోలేవు. అలా చాణక్య మరో ఫ్లాఫ్‌గా మిగిలిపోయింది.


సందీప్‌ కిషన్‌కు ఈ ఏడాది కూడా అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిను వీడని నీడను నేనేతో మళ్లీ సక్సెస్‌బాట పట్టాడనుకునే లోపే తెనాలి రామకృష్ణతో డిజాస్టర్‌ బాట పట్టాడు. గతంలో కామెడీ సినిమాలతో మంచి విజయాలందుకుని.. ఆ తర్వాత ట్రాక్ తప్పిన దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి ‘తెనాలి రామకృష్ణ ఎల్ఎల్‌బీ’తో పలకరించాడు. కానీ ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకపోవడంతో ప్రేక్షకులు కనీసం ఈ సినిమా వంక చూడనైనా చూడలేదు. జబర్దస్త్‌ జోకులతో సినిమా నెట్టుకొద్దామనుకున్నా అక్కడక్కడా తప్పితే ఆ హాస్యం కూడా పెద్దగా పండలేదు.


రాజుగరి గదితో మంచి హిట్‌ అందుకున్న దర్శక నిర్మాత ఓంకార్‌ రాజుగారి గది3తో నిరాశపర్చాడు. తన తమ్ముళ్లకు మంచి హిట్‌ ఇస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఓంకార్‌ రాజుగారి గది3 రూపొందించాడు. కానీ ఈ సినిమా రొటీన్‌ కామెడీ హారర్‌ చిత్రంగా పేరు ముద్రించుకోయింది. అలా రాజుగారి గది3  ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top