శ్రీరెడ్డి.. ఐ సెల్యూట్‌..!

SriReddy has drawn more attention to the evils of Casting Couch, I salute her for that, says Ram Gopal Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డికి ప్రస్తుతం మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలబడ్డాయి. ఆమె లేవనెత్తిన అంశాలను గుర్తించి, టాలీవుడ్‌లో ప్రక్షాళనకు కృషి చేయాలని, ఆమె బయటపెట్టిన సినీ ప్రముఖుల బాగోతాలపై విచారణ జరిపి.. నిజాలు వెలుగులోకి తీసుకురావాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సైతం ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీచేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సవివరమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అంశంపై మరోసారి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ‘వందేళ్ల కిందట సినిమా పరిశ్రమ ఆవిర్భవించిన నాటినుంచి క్యాస్టింగ్‌ కౌచ్‌ మనుగడలో ఉంది. వ్యక్తిగతంగా పలువురిపై ఆమె చేసిన ఆరోపణల జోలికి వెళ్లను కానీ.. గత వందేళ్లలో క్యాస్టింగ్‌ కౌచ్‌ దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చింది. అందుకు ఆమెకు నా సెల్యూట్‌ సమర్పిస్తున్నా’ అని వర్మ ట్వీట్‌ చేశారు.  

‘శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలుపడం తప్పు అని అనుకుంటున్న వారు.. ఆమె ఇచ్చిన షాక్‌ వల్లే.. జాతీయ, అంతర్జాతీయ కమ్యూనిటీలు మేల్కొన్న విషయాన్ని గుర్తించాలి. సినీ పరిశ్రమ కోసం, వర్థమాన నటీమణుల కోసం తన కూతురు సాధించినదానికి శ్రీరెడ్డి తల్లి గర్వపడాలి’ అని వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన శ్రీరెడ్డి తల్లి.. తన కూతురికి జరిగినదానికి బోరున విలపించడం పలువురిని కలిచివేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top