నిర్మాతంటే పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి – కోడి రామకృష్ణ

Sri Venkateswara Creations 2017 success celebrations  - Sakshi

‘‘పెళ్లి పందిరి’ సినిమాతో నా ప్రస్థానం మొదలైందంటూ రాజుగారు ఈ ఫంక్షన్‌ ఏర్పాటు చేయడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఆ సినిమా రాజుగారికే కాదు చాలామందికి టర్నింగ్‌ పాయింట్‌. చలనచిత్ర రంగానికి ఈరోజు రాజుగారు గర్వంగా మిగిలారు. నిర్మాతంటే సక్సెస్‌ఫుల్‌ సినిమా తీయడం మాత్రమే కాదు. పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి. సినిమా అంటే ఇలా తీయాలి అని చూపించాలి. రాజుగారు ఓ సంచలన నిర్మాత అయ్యారంటే దానికి కారణం కృషి, పట్టుదల. ఇలాంటివాళ్లు ఇండస్ట్రీలో ఉంటే చలనచిత్ర రంగం ఎప్పుడూ  ఎవర్‌గ్రీన్‌’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, డీజే, రాజా ది గ్రేట్, ఎంసీఏ’ సినిమాలు వచ్చాయి. ఈ సందర్భంగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సెలబ్రేటింగ్‌ 2017’ కార్యక్రమం నిర్వహించారు.  నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బేనర్‌ నుంచి వచ్చిన ఆరు సక్సెస్‌ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ ఆరు సినిమాల సక్సెస్‌లు మావి కాదు. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లవి. వారందరికీ థ్యాంక్స్‌. 1987 డిసెంబర్‌లో నా సినిమా లైఫ్‌ స్టార్ట్‌ అయింది. స్టార్టింగ్‌లో ఫెయిల్యూర్స్‌ వచ్చాయి. ‘పెళ్లి పందిరి’ మా లైఫ్‌లో లేకుంటే ఈ ఆరు సినిమాలు లేవు. ఐదు వేలరూపాయల గురించి మేం వెతుక్కున్న రోజులున్నాయి. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్న మేం ప్రొడక్షన్‌లోకి రావాలనే ఆలోచనతో వినాయక్‌తో ‘దిల్‌’ సినిమా తీశాం. సుకుమార్, బోయపాటి శీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్‌ అడ్డాల, వేణు.. ఇలా ఎనిమిది మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఏడుమంది సక్సెస్‌లో ఉండటం హ్యాపీ.

హ్యాట్రిక్‌ సినిమాలు చేయాలనుకునేవాణ్ణి. కానీ ఆరు సినిమాలు ఒకే ఏడాదిలో హిట్‌ అవుతాయని కలలో కూడా లేదు. అది దేవుడు రాసిపెట్టి ఉన్నారు’’ అన్నారు. ‘‘ఒకే భాషలో ఆరు సినిమాలు చేసి వరుసగా హిట్స్, బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందుకున్న ఘనత వెంకటేశ్వర బ్యానర్‌కి మాత్రమే దక్కింది. ఇందుకు రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌గార్లకి అభినందనలు’’ అన్నారు హీరో అల్లు అర్జున్‌. ‘‘తెలుగు సినిమాకి ది ఐకానిక్‌ ప్రొడ్యూసర్‌ రాజుగారు. ప్రొడక్షన్‌లోకి దిగాక తెలుస్తోంది అది ఎంత కష్టమో’’ అన్నారు హీరో నాని. ‘‘రాజుగారి సక్సెస్‌లో నేనూ పార్ట్‌ అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ‘‘ఈ ఏడాది ఎస్‌వీసీ బ్యానర్‌లో మొదటి హిట్‌ నా సినిమా అయినందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు సతీశ్‌ వేగేశ్న అన్నారు.

‘‘మూడేళ్ల కిందట యువరాజ్‌ ఆరు సిక్సర్లు కొట్టారు. ఈ ఏడాది రాజుగారు ఆరు హిట్స్‌ కొట్టారు. ఆయన యువరాజ్‌.. ఈయన ‘దిల్‌’ రాజు అన్నారు’’ హరీష్‌ శంకర్‌. ‘‘రాజుగారు వంద సినిమాలు తీయాలి’’ అన్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ‘‘ఎస్‌వీసీ బ్యానర్‌లో 27సినిమాలు తీస్తే అందులో 90శాతం సక్సెస్‌లుండటం గ్రేట్‌’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘‘ఆర్యతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా జర్నీ ప్రారంభమైంది. రాజుగార్ని అప్పటి నుంచి చూస్తున్నా. ఆయన ఓ గోల్‌ పెట్టుకొని రీచ్‌ అవుతుంటారు’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. ‘‘మూడేళ్ల తర్వాత నేను ఇక్కడున్నా’’ అన్నారు భూమిక. నటి జయసుధ, నటుడు జగపతిబాబు, ‘పెళ్లిపందిరి’ నిర్మాత రమేశ్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, సాయికార్తీక్, శక్తికాంత్, నటుడు నరేశ్, హీరో నవీన్‌ చంద్ర, హీరోయిన్స్‌ మెహరీన్, అనుపమా పరమేశ్వరన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నక్కిన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top